Cancer | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): సాధారణ డెలివరీ సాధ్యంకాక ప్రసవ వేదనతో ఇబ్బందిపడుతున్న గర్భిణిని అలాగే కడుపులోని బిడ్డ ప్రాణాలను కాపాడాలన్న ఉద్దేశంతో మాత్రమే గతంలో సీ-సెక్షన్ విధానంలో కోతపెట్టి సిజేరియన్ ఆపరేషన్ చేసేవారు. అయితే, నేటి ఉరుకులు పరుగుల జీవితంలో బిడ్డ ఎప్పుడు పుట్టాలన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులే నిర్ణయించేస్తున్నారు. తిథి-నక్షత్రం-మంచిరోజు అని ఒకరు, సెలవు రోజని మరొకరు, అభిమాన నటుడి పుట్టినరోజు అని ఇంకొకరు ఇలా కారణాలు ఏవైతేనేమీ డెలివరీ తేదీని కూడా ప్లాన్ చేసుకొనే ధోరణి ఇటీవలి కాలంలో ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ పరిణామమే పుట్టే బిడ్డలకు ప్రాణాంతకంగా మారొచ్చని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది.
సాధారణ ప్రసవం లేదా తల్లీబిడ్డను కాపాడేందుకు అప్పటికప్పుడు చేసే సిజేరియన్ ఆపరేషన్‌తో పోలిస్తే ముందస్తుగా ఒక తేదీ అనుకుని ప్లాన్ చేసుకొనే సీ-సెక్షన్ ఆపరేషన్‌తో పుట్టే చిన్నారులకు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా (ఏఎల్ఎల్-ఒక రకమైన రక్త క్యాన్సర్) ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఈ మేరకు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలు ‘ది ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్’లో ప్రచురితమయ్యాయి.
స్వీడన్లో 1982-89, 1999-2015 మధ్య జన్మించిన 25 లక్షల మంది చిన్నారుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. వీరిలో 3.76 లక్షల మంది సీ-సెక్షన్ ద్వారా జన్మించారు. ఇలా పుట్టిన వారిలో 1,495 మందికి లుకేమియా వ్యాధి సోకినట్టు అధ్యయనకారులు తేల్చారు. వీరందరూ సీ-సెక్షన్‌ను ప్లాన్ చేసుకొన్నవారేనని తెలిపారు.
సాధారణ ప్రసవంతో పోలిస్తే, ముందుగా నిర్ణయించిన సీ-సెక్షన్‌తో (ప్లాన్డ్) పుట్టిన చిన్నారులకు అక్యూట్ లింఫోబ్లాస్టిక్ లుకేమియా సోకే ప్రమాదం 21 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. ఆడ పిల్లలతో పోలిస్తే, మగ పిల్లలకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వివరించారు.
సాధారణ ప్రసవంలో శిశువు బయటికొచ్చే వేళ యోని బ్యాక్టీరియా బిడ్డకు అంటుకుంటుంది. ఈ బ్యాక్టీరియా సోకడం పుట్టిన బిడ్డకు మంచిదని వైద్యులు చెప్తారు. దీనికి కారణాన్ని కూడా ఇలా వివరిస్తారు. పుట్టుక సమయంలోనే బిడ్డకు బ్యాక్టీరియా సోకడంతో భవిష్యత్తులో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య తేడాలను ఆ శిశువు శరీరం గుర్తించడం సులభమవుతుంది. అంతేకాదు భవిష్యత్తులో అలర్జీలు, రోగనిరోధక శక్తి వంటి సమస్యలు రావని చెప్తారు. అలాగే సాధారణ ప్రసవంలో బిడ్డపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇది ప్రతికూల సమయాల్లో శరీరం ఎలా ప్రవర్తించాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. అప్పటికప్పుడు నిర్ణయించే సిజేరియన్ కేసుల్లోనూ బిడ్డ మీద పై రెండు పరిణామాలు ఎంతో కొంత ఉంటాయి. అయితే, ప్లాన్ చేసుకొన్న సీ-సెక్షన్ కేసుల్లో ఇవేమీ ఉండవు. అందుకే, ఏఎల్ఎల్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉన్నదని అధ్యయనకారులు చెప్తున్నారు.