న్యూయార్క్ : పంది మూత్ర పిండాలను మానవులకు అమర్చే రోజులు రాబోతున్నాయి. ఇతర జాతుల అవయవాలను మానవులకు అమర్చడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించే లక్ష్యంతో న్యూయార్క్ విశ్వవిద్యాలయంలోని లంగోన్ హెల్త్ డాక్టర్లు అధ్యయనాలను నిర్వహించారు. సుదీర్ఘ కాలం నుంచి వేధిస్తున్న మానవ అవయవాల కొరత సమస్యను పరిష్కరించడం కోసం ఇతర జాతుల అవయవాలను ఉపయోగించగలగడంపై పరిశోధనలు చేశారు. దీనినే జెనోట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. దీనిలో ప్రధాన సమస్య మానవ శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ. దీనికి హానికర వైరస్లు, ప్రయోజనకరమైన దాతల అవయవాల మధ్య తేడా తెలియదు. వీటిలో ఏది శరీరంలో ప్రవేశించినా, దానిపైకి యాంటీబాడీస్‌ను పంపిస్తుంది.
ఇవి దాత అవయవానికి హాని చేయగలవు. ఫలితంగా అవయవ మార్పిడి విఫలమవుతుంది. బ్రెయిన్ డెడ్ అయిన 57 ఏళ్ల వయసు గల పురుషునికి ఎన్‌వైయూ పరిశోధకులు పంది మూత్రపిండాలను విజయవంతంగా అమర్చారు. ఈ పంది మూత్రపిండాలను జన్యుపరంగా మార్పులు చేశారు. ఆయనను రెండు నెలలపాటు లైఫ్ సపోర్ట్‌పై ఉంచారు. ఆ సమయంలో క్రమం తప్పకుండా ఈ కొత్త అవయవంపై బయాప్సీస్ చేశారు. పంది అవయవం పట్ల రోగిలోని రోగ నిరోధక వ్యవస్థ ఏ విధంగా స్పందించిందో గుర్తించారు. 5,100 పంది, మానవ జన్యువులను మ్యాప్ చేశారు. శరీరంలోని ప్రతి రోగ నిరోధక కణాన్ని గుర్తించారు. ఈ విధానాలను మరో 20 మంది రోగులపై ప్రయోగించేందుకు ప్రయత్నిస్తున్నారు.