హైదరాబాద్ : భూతల స్వర్గంగా పిలువడే అమెరికాను(America) ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. స్వేచ్ఛా, స్వాతంత్రాలకు పెట్టింది పేరైనా అమెరికాను సందర్శించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. లేటెస్ట్ టెక్నాలజీ, స్వేచ్ఛాయుతమైన జీవనం వంటి పలు కీలక అంశాల్లో ముందుండే యూఎస్‌ని మెజార్టీ ప్రజలు ఇష్టపడుతుంటారు.
కానీ, నేడు పరిస్థితులు అందుకు విరుద్ధంగా మారిపోయాయి. అమెరికా కంటే చైనానే(China) ఎక్కువ మంది ఇష్టపడున్నారని ఇటీవల ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలడం ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు ప్రపంచంలో సూపర్ పోలీస్‌గా వెలుగొందుతూ పెద్దన్న పాత్ర పోషిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కే (Jinping) ఎక్కువ ప్రజాధరణ లభించడం మరో విశేషం.
ట్రంప్ కంటే జిన్‌పింగ్‌కే అత్యధిక ప్రజాదరణ..
వివరాల్లోకి వెళ్తే..ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) ఇటీవల కొత్తగా నిర్వహించిన తాజా గ్లోబల్ సర్వేలో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంటే, చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది అభిమానాన్ని (Favorable) పొందినట్లు వెల్లడైంది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఈ నిష్పక్షపాత సంస్థ వెల్లడించిన ఫలితాల ప్రకారం..36 దేశాల్లో సర్వే చేపట్టగా 25 దేశాల్లోని ప్రజలు అమెరికా కంటే చైనాను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అలాగే 22 దేశాలలో షి జిన్‌పింగ్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే ఎక్కువ ప్రజాదరణ ఉందని తేలింది.
అనేక దేశాలలో చైనా పట్ల సానుకూల అభిప్రాయాలు రోజు రోజుకు రికార్డు స్థాయికి పెరుగుతుండగా.. మరోవైపు అమెరికా పట్ల సదాభిప్రాయాలు క్షీణించాయి. సాధారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా నాయకుడు షీ జిన్‌పింగ్ ఇద్దరిపైనా ప్రజలు తక్కువ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ ట్రంప్ కంటే జిన్‌పింగే ఎక్కువ స్కోరు సాధించారు. వ్యక్తిగత స్వేచ్ఛలను చైనా కంటే అమెరికానే ఎక్కువగా గౌరవిస్తుందని సర్వేలో పాల్గొన్న ప్రజలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇతర దేశాల వ్యవహారాలలో అమెరికా కంటే చైనా తక్కువగా జోక్యం చేసుకుంటుందని బలంగా నమ్ముతున్నారు. ప్యూ సంస్థ ఫిబ్రవరి, మే నెలల మధ్య 36 దేశాలలో 42,000 మందికి పైగా ప్రజలను సర్వే చేసి ఈ వివరాలను వెల్లడించింది.
యూరప్ చూపు చైనా వైపు..
చైనా వైపు మొగ్గు చూపిన దేశాలలో స్పెయిన్, ఇండోనేషియా, ఇటలీ, గ్రీస్, కెనడా ఉన్నాయి. కేవలం ఆరు దేశాలు మాత్రమే అమెరికాకు మద్దతుగా నిలిచాయి. వీటిలో చాలా వరకు అమెరికాకు బలమైన మిత్ర దేశాలుగా ఉన్నవే కావడం గమనార్హం. అవి వరుసగా పోలాండ్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, భారతదేశం, జపాన్, ఇజ్రాయెల్. అలాగే మరో 20 దేశాలలో అమెరికా పట్ల అనుకూల అభిప్రాయం ఇటీవలి కాలంలో స్థిరంగా తగ్గుతూ వస్తోందని కూడా సర్వేలో తేల్చారు. అదే సమయంలో చైనా పట్ల అనుకూల అభిప్రాయం పెరుగుతూ వస్తోందని కూడా ఆ సంస్థ గుర్తించింది.