Maria Machado : ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize) ఈ ఏడాదికిగానూ వెనెజువెలా విపక్ష నేత మరియా కొరీనా మచాడో (Maria Corina Machado) ను వరించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ నార్వే రాజధాని ఓస్లోలో నోబెల్ పురస్కార ప్రదానోత్సవానికి ఆమె హాజరుకాలేదు. నోబెల్ ప్రదానోత్సవానికి ముందు నిర్వహించే మీడియా సమావేశానికి కొరీనా రాకపోవడంతో నిర్వాహకులు ఆ సమావేశాన్ని రద్దుచేశారు.
అనంతరం అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి కూడా ఆమె హాజరు కావట్లేదని సమాచారం అందుకున్న ఆర్గనైజర్లు.. ఆ విషయాన్ని మీడియాకు తెలిపారు. నోబెల్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ క్రిస్టియన్ బెర్గ్ హార్ప్వికెన్ మాట్లాడుతూ.. మరియా తరఫున ఆమె కుమార్తె నోబెల్ బహుమతిని స్వీకరించనున్నట్లు వెల్లడించారు. అయితే ఆమె బహుమతి అందుకోవడానికి రాకపోవడం వెనుక బలమైన కారణమే ఉంది. అజ్ఞాతంలో ఉన్న ఆమె నోబెల్ బహుమతి స్వీకరించడానికి దేశందాటి బయటకు వెళ్తే పరారీలో ఉన్న నేరస్థురాలిగా ప్రకటిస్తామని ఇప్పటికే వెనెజువెలా అటార్నీ జనరల్ హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో నోబెల్ ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరుకాలేకపోయారు. అయితే మరియా కుటుంబసభ్యులు, వివిధ దేశాల ప్రముఖులు హాజరయ్యారు. కాగా వెనెజువెలా ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసినందుకుగాను మరియా కొరీనాకు నార్వే కమిటీ నోబెల్ శాంతి పురస్కారం ప్రకటించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధన కోసం శాంతి మార్గంలో ఆమె విశేష కృషి చేశారని కొనియాడింది. ఆమె ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని, ఏడాది నుంచి అజ్ఞాతంలోనే ఉంటున్నారని పేర్కొన్నది.