న్యూఢిల్లీ: పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి(Asif Ali Zardari) ఆరోగ్యం క్షీణించింది. కరాచీలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన్ను చేర్పించారు. ఏప్రిల్ ఒకటో తేదీన ఆయన ఆస్పత్రిలో చేరినట్లు మీడియా ద్వారా తెలుస్తోంది. కరాచీకి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న నవాబ్షా నుంచి జర్దారీని ఆస్పత్రికి తీసుకువచ్చారు.
జర్దారీ వయసు 69 ఏళ్లు. జ్వరం, ఇన్ఫెక్షన్ నుంచి ఆయన బాధపడుతున్నారు. సోమవారం అర్థరాత్రి ఆయన్ను ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేతకు ప్రస్తుతం వైద్య పరీక్షలు చేస్తున్నారు. ఆస్పత్రి వద్ద భద్రతను పెంచారు. ఆదివారం నవాబ్‌షాలో ఉన్న జర్దారి హౌజ్‌లో ఆయన ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అసిఫ్ అలీ జర్దారీ ఆరోగ్యం ఇటీవల ఆందోళనకరంగా మారింది. 2024లో ఆయన ఓ విమానం దిగబోతో కిందపడిపోయారు. ఆ సమయంలో ఆయన పాదానికి ఫ్రాక్చర్ అయ్యింది. దాని వల్ల ఆయన చైనా ట్రిప్‌ను రద్దు చేయాల్సి వచ్చింది.