న్యూఢిల్లీ: పాకిస్థాన్‌కు చెందిన ఓ మోడల్.. సిక్కు మతస్థులను అవమానించే రీతిలో ప్రవర్తించింది. కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్ సాహిబ్‌లో పాక్ మోడల్ సౌలేహ ఫోటో షూట్ నిర్వహించింది. ఆ ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీని పట్ల సిక్కు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. తలపై దుపట్టా లేకుండా గురుద్వారాలో తిరగడం సిక్కు వర్గీయుల మనోభావాలను కించపరచడమే అని శిరోమణి అకాలీ దళ్ ఆరోపించింది. మన్నత్ క్లాతింగ్ బ్రాండ్ కోసం సౌలేహ కర్తార్‌పూర్‌లో ఫోటోషూట్ చేసింది. గురుద్వారాకు వెళ్లిన వారు కచ్చితంగా తమ తలపై ఏదైనా వస్త్రాన్ని ధరించాల్సి ఉంటుంది. ఆ పవిత్ర స్థలానికి మర్యాదపూర్వకంగా సిక్కులు ఇలా చేస్తుంటారు. అయితే ఫోటో షూట్‌పై విమర్శలు తలెత్తడంతో.. మోడల్ సౌలేహ క్షమాపణలు చెప్పింది. ఎవరి మనోభావాలను కించపరచడం తన ఉద్దేశం కాదన్నారు. సిక్కు నేతలు చేసిన ఆరోపణల ఆధారంగా పాకిస్థాన్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు.