ఇస్లామాబాద్, నవంబర్ 8: పాకిస్థాన్ త్వరలోనే ఫీల్డ్ మార్షల్ దేశంగా అవతరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆర్మీ చీఫ్‌గా ఉన్న అసిమ్ మునీర్‌కు అపరిమిత అధికారాలు కల్పించేందుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ 27వ రాజ్యాంగ సవరణ ముసాయిదాను సిద్ధం చేసింది. దీనికి మంత్రివర్గం కూడా ఆమోదం తెలిపింది.
ఈ రాజ్యాంగ సవరణ ఆర్మీ చీఫ్‌ను దేశ రక్షణ దళాల అధిపతిగా మారుస్తుంది. ఆ పదవిని మునీర్‌కే కట్టబెడతారన్నది అందరూ ఊహిస్తున్న విషయమే. అదే జరిగితే అతనికి సైన్యం, నేవీ, వైమానిక దళంపై ఏకపక్ష ఆధిపత్యాన్ని కల్పిస్తుంది. ఒక విధంగా దేశానికి ఆయనే సర్వాధికారి. అంతేకాకుండా ఈ రాజ్యాంగ సవరణతో పౌర పర్యవేక్షణ చివరి పొరను కూడా నిర్వీర్యం చేస్తుంది. పెళుసైన ప్రజాస్వామ్యాన్ని ఫీల్డ్ మార్షల్ దేశంగా మారుస్తుంది.