లాహోర్: పాకిస్థాన్లో మరో గ్యాంగ్స్టర్ (Gangstar) హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలజ్ తిపును (Ameer Balaj Tipu) ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్తోపాటు మరో ఇద్దరిపై సాయుధుడైన ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. హుటాహుటిన వారికి జిన్నా దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ అమీర్ మరణించాడు.
కాగా, అమీర్ సహాయకులు జరిపిన కాల్పుల్లో దుండగుడు అక్కడికక్కడే మరణించాడని పోలీసులు తెలిపారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నామన్నారు. అయితే అమీర్ కుటుంబానిది హింసాత్మక చరిత్ర ఉన్నది. 2010లో అల్లమా ఇక్బాల్ ఎయిర్పోర్టుపై జరిగిన దాడిలో ఆయన తండ్రి ఆరిఫ్ అమీర్ చనిపోయారు.