ఎట్టి పరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేయనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తేల్చి చెప్పారు. శుక్రవారం ప్రధాని ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోబోతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ పై వ్యాఖ్యలు చేశారు. బుధవారం ప్రధాని ఇమ్రాన్ పాత్రికేయులతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి అన్ని దారులూ వెతుకుతున్నాయని, తనపై పెట్టిన అవిశ్వాసంలో ప్రతిపక్షాలు ఎంత మాత్రమూ నెగ్గవని ఇమ్రాన్ ధీమా వ్యక్తం చేశారు. చివరి అవకాశం వరకూ తాను వేచిచూస్తూనే వుంటానని, చివరాఖరుకు తాను ప్రతిపక్షాలకు షాక్ ఇస్తానని ప్రకటించారు.
ప్రతిపక్షాలు తీవ్రమైన ఒత్తిడిలో వున్నాయని, ఏం చేయాలో పాలుపోవడం లేదని విమర్శించారు. తన దగ్గర చాలా వ్యూహాలున్నాయని, ఇప్పటి వరకూ ఏ వ్యూహాన్ని బయటకు తీయలేదని, అదే తన ట్రంప్ కార్డ్ అని ఇమ్రాన్ బీరాలు పలికారు. ‘నేను చేతులు ముడుచుకొని కూర్చున్నానని అందరూ అనుకుంటున్నారు. అలా ఏమీ కాదు. నా వద్ద చాలా వ్యూహాలున్నాయి. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామా చేయను. అసలు రాజీనామా ఎందుకు చేయాలి? దొంగలు పెట్టే ఒత్తిడి వల్ల నేను రాజీనామా చేయాలా?’ అంటూ ప్రధాని ఇమ్రాన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.