9/11 ఉగ్రదాడుల తర్వాతే ప్రపంచంలో ఇస్లామోఫోబియా పెరిగిపోయిందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. ఇస్లాంకు, ఉగ్రవాదానికి ముడిపెట్టడం కూడా అంతే స్థాయిలో పెరిగిందని, దీనికి అడ్డుకట్ట వేయడానికి ముస్లిం దేశాలు చేసిందేమీ లేదని ఇమ్రాన్ విమర్శించారు. ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ సమావేశంలో ఇమ్రాన్ పాల్గొన్నారు. ఇస్లాంలో ఎలాంటి భేదాలూ లేవని, ఉగ్రవాదనికి, నమ్మకానికి ఎలాంటి సంబంధమూ లేదన్నారు. ముస్లింలు, ఉగ్రవాదానికి పశ్చిమ దేశాలు లింకులు పెడుతున్నాయని, అయితే.. సామాన్య ముస్లింలను ఎలా నిర్వచిస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతర్జాతీయ క్రికెటర్‌గా ఉన్న సమయంలో చాలా కాలం ఇంగ్లాండ్‌లోనే ఉన్నానని, అప్పుడు పశ్చిమ నాగరికతను చాలా అర్థం చేసుకున్నానని ప్రధాని ఇమ్రాన్ పేర్కొన్నారు.
‘ఇస్లామో ఫోబియా అన్నది చాలా పెరిగిపోయింది. ఎందుకో తెలుసా… ఈ తప్పుడు ప్రచారాన్ని ముస్లిం దేశాలు అడ్డుకట్ట వేయలేకపోవడమే దీనికి కారణం. ఉగ్రవాదానికి ఏ మతంతోనైనా ఎలా సంబంధముంటుంది? అసలు ఇస్లాం, ఉగ్రవాదం రెండూ సమానమెలా అవుతాయి? అదే నిజమైతే.. పాశ్చాత్యులు ఓ ఆధునిక ముస్లింకి, అభ్యుదయ భావాలున్న ముస్లింని ఎలా నిర్వచిస్తారు?’ అంటూ ఇమ్రాన్ ప్రశ్నించారు. ఉగ్రవాదానికి, ముస్లిం మతానికి ముడిపెట్టడం బాగా పెరిగిందని, దురదృష్ట వశాత్తు దీనికి అడ్డుకట్ట వేయలేకపోయామని అన్నారు. ముస్లిం దేశాలు ఈ విషయంపై కచ్చితంగా ఓ నిర్ణయం తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. కానీ…. చాలా ముస్లిం ప్రభుత్వాలు.. తాము మితవాదులమని చెప్పుకు తిరుగుతున్నాయని ఇమ్రాన్ విరుచుకుపడ్డారు.
ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ 48 వ సమావేశాలు ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్నాయి. రెండు రోజుల పాటు ఇవి జరుగుతాయి. దాదాపు 57 దేశాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈసారి పాకిస్తాన్ ఈ సమావేశాలకు ఆతిథ్యమిస్తోంది. అయితే చైనాను కూడా ఈ సమావేశాలకు పాక్ ఆహ్వానించింది. ఇలా ఇస్లామిక్ దేశాల మీటింగ్‌లకు చైనా తరపున ఓ మంత్రి హాజరు కావడం ఇదే ప్రథమం. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొనబోయే 57 దేశాల ప్రతినిధులను ఆహ్వానిస్తూ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఓ ట్వీట్ చేశారు. ఈ సదస్సులో పాల్గొనబోయే విదేశాంగ మంత్రులు, ప్రతినిధులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఐకమత్యం, న్యాయం, అభివృద్ధి …. ఈ మూడు అంశాలను ఇందులో చర్చకు వస్తాయని ఇమ్రాన్ పేర్కొన్నారు.