పాకిస్తాన్లో ముందస్తు ఎన్నికలు జరగబోతున్నాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రధాని షెహబాజ్ షరీఫ్ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని, అందుకే ఇమ్రాన్ ఖాన్ కూడా బహిరంగ సభలను నిర్వహిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ తూచ్ అన్నట్లు తెలుస్తోంది. పూర్తి కాలం పదవిలో ఉండేందుకే పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నిశ్చయించుకున్నారని సమాచారం. వచ్చే యేడాది ఆగస్టుతో ప్రస్తుత ప్రభుత్వ పదవీ కాలం ముగుస్తుంది. అప్పటి వరకూ ప్రధాని పదవిలో ఉండాలనే షెహబాజ్ షరీఫ్ నిశ్చయించుకున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా తీవ్ర ఒత్తిడిలో ఉంది. అంతర్జాతీయ సమాజం ఆర్థిక సహాయం చేస్తుందన్న ఆశతో పాక్ ప్రభుత్వం ఉంది. ఇదే సరైన సమయం అనుకున్నారో ఏమో గానీ.. మాజీ ప్రధాని ఇమ్రాన్ మాత్రం ముందస్తుకు డిమాండ్ చేస్తున్నారు. పాక్‌లో ముందస్తు ఎన్నికలు వస్తాయంటూ ఆయన తెగ ప్రచారం చేస్తున్నారు.
ప్రధాని షెహబాజ్ షరీఫ్ మిత్రపక్షాలతో ఓ సమావేశం నిర్వహించారు. మధ్యంతరం కాకుండా.. పూర్తి కాలం ప్రభుత్వంలో ఉండాలని ఈ సమావేశంలోనే ప్రధాని నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా దేశంలోని రాజకీయ వాతావరణాన్ని కూడా చర్చించారు. పూర్తి కాలం కొనసాగాలని, ముందస్తు వద్దని మిత్రపక్షాలు గట్టిగా అభిప్రాయపడ్డాయి. కొన్ని రోజుల క్రితం ప్రధాని షెహబాజ్ ఆయన సోదరుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో లండన్‌లో భేటీ అయ్యారు. ముందస్తుకు వెళ్లొద్దని నవాజ్ షరీఫ్ కూడా ప్రధానికి సూచించారు.