న్యూఢిల్లీ: అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ రంధ్రం(Ozone hole) గత మూడేళ్ల నుంచి పెద్దగానే ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. కొత్త అధ్యయనానికి చెందిన నివేదికను నేచర్ జర్నల్‌లో ప్రచురించారు. అంటార్కిటికా వద్ద ఆకాశంలో ఉన్న ఓజోన్ రంధ్రం చాలా పెద్ద సైజులోనే ఉందని, దీనికి కేవలం క్లోరోఫ్లోరోకార్బన్లు మాత్రమే కారణం కాదు అని, ఇతర అంశాల ప్రభావం కూడా ఎక్కువగా ఉన్నట్లు కొత్త స్టడీలో తేల్చారు. సూర్యుడి నుంచి విడుదలయ్యే అతినీలలోహిత కిరణాలను భూవాతావరణంలో అడ్డుకునే శక్తి కేవలం ఓజోన్ పొరకు మాత్రమే ఉంది. అయితే సీఎఫ్‌సీల వల్ల ఆ పొర దెబ్బతింటున్నది.
న్యూజిలాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఓటాగోలో పీహెచ్డీ చేస్తున్న హన్నా కేసినిచ్ పరిశోధకుడు ఓజోన్ పొరపై తాజా రిపోర్టును తయారు చేశారు. 19 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులతో పోలిస్తే, ఇప్పుడు ఓజోన్ పొర మరింత బలహీనపడినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. తన ఉద్దేశం ప్రకారం ఆ ప్రాంతంలో రంధ్రం పెద్దగానే ఉందని, చాలా లోతుగా రంద్రం ఏర్పడినట్లు కేసినిచ్ తెలిపారు.
నెలవారిగా, రోజు వారిగా ఓజోన్‌లో వస్తున్న మార్పుల్ని స్టడీ చేశారు. 2004 నుంచి 2022 వరకు వేర్వరు రేఖాంశాలు, అక్షాంశాల్లో ఓజోన్ గుర్తించి అధ్యయనం చేశారు. అనేక అంశాల వల్ల ఓజోన్ పొర సన్నగిల్లుతోందని రిపోర్టులో రాశారు.