Taiwan | పింగ్టుంగ్ (తైవాన్) : వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆకుపచ్చని ఉడుములను పెద్ద ఎత్తున వధించేందుకు తైవాన్ ప్రయత్నిస్తున్నది. ఈ ద్వీపంలోని దక్షిణ, మధ్య ప్రాంతాల్లో దాదాపు 2 లక్షల వరకు ఈ జీవులు ఉన్నట్లు అంచనా. సుమారు 1,20,000 ఉడుములను వధించాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఈ ఉడుములు వ్యవసాయ పంటలపైనే ఆధారపడి జీవిస్తుంటాయని అటవీ పరిరక్షణ సంస్థ చెప్తున్నది.
ఇవి చూడటానికి అందంగా ఉంటాయని చాలా మంది వీటిని పెంచుకుంటున్నారు. ఇవి దాదాపు 20 ఏళ్లు జీవిస్తుండటంతో వీటిని అర్థాంతరంగా వదిలేస్తున్నారు. ఫలితంగా వ్యవసాయం, పర్యావరణం దెబ్బతింటున్నాయి. వీటిని సహజంగా వేటాడే జంతువులేవీ ఇక్కడ లేకపోవడం సమస్యను తీవ్రతరం చేస్తున్నది.