న్యూయార్క్: ఆర్టెమిస్-2 మిషన్‌లో భాగమైన ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్.. చంద్రుడి ఆవలి వైపు నుంచి ప్రయాణించింది. ఆ సమయంలో సుమారు 40 నిమిషాల పాటు ఆ స్పేస్‌క్రాఫ్ట్‌లో బ్లాకౌట్ అయ్యింది. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 6.44 నిమిషాలకు ఆ బ్లాకౌట్ ప్రారంభమైంది. నాసా ప్రకారం మళ్లీ రాత్రి 7.25 నిమిషాలకు బ్లాకౌట్ ముగిసింది. అయితే ఆ సమయంలో స్పేస్‌క్రాఫ్ట్‌ను చిమ్మచీకట్లు కమ్మేశాయి. చంద్రుడి ఆవల చీకటి వైపు ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ ఉన్న సమయంలో వ్యోమగాములు అనేక పరీక్షలు నిర్వహించారు. మిషన్ కంట్రోల్‌తో లింకు లేకున్నా.. వ్యోమగాములు మాత్రం శాస్త్రీయ పరిశోధనలు చేపట్టారు. చంద్రుడికి మరో వైపు ఉన్న సమయంలో.. ఆస్ట్రోనాట్స్ ఒంటరి అయిపోయారు. వారితో ఎటువంటి కమ్యూనికేషన్ జరగలేదు. భూమికి, స్పేస్‌క్రాఫ్ట్‌కు మధ్య చంద్రుడు ఉండడం వల్ల సిగ్నల్ అందదు. దీనితో బ్లాకౌట్ జరుగుతుంది. అయితే ఆ సమయంలో చంద్రుడి చీకటి ప్రదేశాన్ని ఆస్ట్రోనాట్స్ స్టడీ చేసినట్లు తెలుస్తోంది. ఆ టైంలోనే అపోలో 13 రికార్డును ఆర్టెమిస్ వ్యోమగాములు బ్రేక్ చేశారు. అపోలో 13 కన్నా సుమారు 4 వేల మైళ్లు అధిక దూరం ఆర్టెమిస్ వ్యోమగాములు ప్రయాణించారు.
ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో ఉన్న వ్యోమగాములు.. సూర్య గ్రహణాన్ని వీక్షించారు. అద్భుతమైన ఆ క్షణాలను వ్యోమగాములు ప్రత్యక్షంగా అనుభవించారు. చంద్రుడికి అతి సమీపం నుంచి సూర్య గ్రహణాన్ని మనుషులు వీక్షించడం చరిత్రలో ఇదే మొదటిసారి అవుతుంది. చంద్రుడు భ్రమణ సమయంలో ఆర్టెమిస్ సిబ్బంది అనూహ్యమైన సూర్యాస్తమయాన్ని వీక్షిస్తారు. ఆ సమయంలో సోలార్ కరోనా ఏర్పడనుతుంది. ఇదే సమయంలో ఆర్టెమిస్‌లో ఉన్న వ్యోమగాములు .. అంతరిక్షంలో ఉన్న అనేక గ్రహాలను ఫోటో తీశారు. భూమి, మెర్కూరీ, వీనస్, మార్స్, శని గ్రహాలను వ్యోమగాములు ఫోటో తీశారు. కేవలం ఆస్ట్రోనాట్స్ మాత్రమే వీక్షించగల గ్రహణాన్ని ప్రత్యేక కెమెరాలతో ఫోటోలు తీశారు. ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ జర్నీ సమయంలో అనేక శాస్త్రీయ పరిశోధనలు కూడా చేపట్టారు. తమ ప్రయాణంలో ఓ అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణాన్ని వీక్షించినట్లు ఆస్ట్రోనాట్స్ చెప్పారు. కాని దీన్ని వర్ణించడం అంత సులువైన అంశంకాదన్నారు.
సుమారు ఏడు గంటల పాటు చంద్రుడి ఉపరితలాన్ని వ్యోమగాములు అబ్జర్వ్ చేశారు. కొత్తగా రెండు అగాధాలను గుర్తించినట్లు తెలుస్తోంది. వాటికి పేర్లు కూడా పెట్టారు. గతంలో వెళ్లిన స్పేస్‌క్రాఫ్ట్ ఇంటిగ్రిటీ పేరును ఓ క్రాటర్కు పెట్టారు. రెండో క్రాటర్కు కారల్ అని నామకరణం చేశారు. ఆర్టెమిస్ మిషన్ కమాండర్ రీడ్ వైజ్మాన్ భార్య ఇటీవల క్యాన్సర్‌తో మృతిచెందింది. అతని భార్య పేరు కారల్. ఆమె పేరును ఓ క్రాటర్కు పెట్టారు. పేరు పెట్టే సమయంలో హూస్టన్‌లో ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. చంద్రుడి ఆవలివైపు చూసిన ఆర్టెమిస్ వ్యోమగాములు తిరిగి భూమి వైపు పయనమయ్యారు. 10వ తేదీన భూమిపై ఆ ఆస్ట్రోనాట్స్ ల్యాండ్ అవుతారు.