టెహ్రాన్, జూన్ 24: ఇజ్రాయెల్ బలగాలు (ఐడీఎఫ్) ఆపరేషన్ నార్నియాతో.. ఇరాన్ అణు కార్యక్రమంపై ఊహించని విధంగా దెబ్బకొట్టాయి. రాత్రిపూట తమ ఇంటిలో నిద్రిస్తున్న 10 మంది ఇరాన్ సైంటిస్టులను.. ఐడీఎఫ్ హతమార్చినట్టు ‘చానల్ 12’ వార్తా కథనం పేర్కొన్నది. ఇరాన్ అణు కార్యక్రమం నిలిచిపోవాలంటే, అందులో కీలకంగా ఉన్న సైంటిస్టుల్ని మట్టుబెట్టేందుకు ఇజ్రాయెల్ సిద్ధమైంది.
ఇందుకోసం ఐడీఎఫ్ ప్రత్యేక సైనిక ఆపరేషన్ ‘నార్నియా’ను చేపట్టింది. అణ్వస్ర్తాల తయారీలో అపార అనుభవం, ఇరాన్ అణు కార్యక్రమంలో కీలకంగా ఉన్న సైంటిస్టుల జాబితా సిద్ధం చేసుకొని..నిఘా వర్గాల కచ్చితమైన సమాచారంతో లక్ష్యాలను ఐడీఎఫ్ పూర్తిచేసింది. బయటి ప్రపంచానికి తెలియని ఓ ప్రత్యేక ఆయుధాన్ని ఈ ఆపరేషన్ నార్నియాలో ఇజ్రాయెల్ వాడినట్టు తెలిసింది.
ఫెరియెదౌన్ అబ్బాసీ (అణు ఇంజనీరింగ్), మహమ్మద్ మాహ్దీ టెహ్రాంచీ (ఫిజిక్స్) అక్బర్ మటాలి జాదే (కెమెకల్ ఇంజనీర్), సయీద్ బెరాజీ (మెటీరియల్స్ ఇంజనీర్), ఆమీర్ హస్సన్ ఫాకాహీ (ఫిజిక్స్), అల్ హమీద్ మినుషార్ (రియాక్టర్ ఫిజిక్స్), మాన్సోర్ అస్గరీ (ఫిజిక్స్), రెజా డవలపార్కీ దర్యానీ (అణు ఇంజనీర్), అలీ బాఖియా కాథెహెర్మి (మెకానికల్).. వీళ్లంతా ఆపరేషన్ నార్నియాకు బలయ్యారని చానల్-9, చానల్-12 వార్తా కథనాలు తెలిపాయి.