వాషింగ్టన్: అమెరికాలో గ్రీన్‌కార్డు కోసం వేచి చూస్తున్న వలసదారులకు సంబంధించిన యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉంటూ, పర్మినెంట్ రెసిడెన్సీ(గ్రీన్‌కార్డు)కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ స్వదేశాలకు వెళ్లి, అక్కడి నుంచే ఇమ్మిగ్రేషన్ వీసా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అమెరికా స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అక్రమ వలసదారులకు సంబంధించినవి కాదు. బీ1/బీ2(పర్యాటక) ఎఫ్1/ఎం1(విద్యార్థులు), జె1, హెచ్-1బీ, ఓ-1 వంటి తాత్కాలిక వీసాలపై అమెరికాకు వచ్చి, ఆపై గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకునేవారందరికీ ఇది వర్తిస్తుంది. దీనిగురించి యూఎస్సీఐఎస్ డైరెక్టర్ జోసెఫ్ ఎడ్లో మాటాడుతూ తాత్కాలిక అవసరాల కోసం వచ్చినవారు, శాశ్వత నివాసం కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు తమ స్వదేశాలకు వెళ్లి, అక్కడి అమెరికా రాయబార కార్యాలయాల ద్వారా ఇమ్మిగ్రెంట్ వీసా పొంది, తిరిగి అమెరికాలో ప్రవేశించాలని ఆయన కోరారు.
ఐైప్లె చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి
కాగా నిబంధనల్లో కొన్ని మినహాయింపులు ప్రకటించారు. అమెరికా జాతీయ ప్రయోజనాలు లేక ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమనుకొనే వలసదారులకు ఈ రూల్స్ నుంచి మినహాయింపులు ఇచ్చారు. గ్రీన్‌కార్డు ఆశావహులు సమర్పించిన దరఖాస్తుల ఆధారంగా, తమ దేశానికి ప్రయోజనం ఉందని భావిస్తే వాటిని పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. దీంతో వారు ప్రస్తుతం నిబంధనల ప్రకారమే కొనసాగే అవకాశం ఉంటుంది. మిగతావారు వారి మాతృదేశానికి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరింత నిశితంగా అప్లికేషన్ల పరిశీలన
గతంలో వలస చట్టాలను ఉల్లంఘించడం, ప్రభుత్వ సంస్థల వద్ద అబద్ధపు సాక్ష్యాలు ఇవ్వడం లేదా మోసాలకు పాల్పడటం, వీసా పొందిన అసలు ఉద్దేశానికి విరుద్ధంగా వ్యవహరించడం, నిర్ణీత సమయం తర్వాత కూడా అమెరికాలో ఉండటం తదితర అంశాలను అధికారులు మరింత నిశితంగా పరిశీలించనున్నారు. హెచ్-1బీ, ఎల్-1 వర్కర్లకు డ్యూయల్ ఇంటెంట్ వెసులుబాటు ఉన్నప్పటికీ, వీరికి గ్రీన్‌కార్డు ప్రక్రియ ఇకపై ఆటోమేటిక్‌గా ఉండదు. కాగా ఈ కొత్త నిబంధనలకు సంబంధించిన తేదీని యూఎస్సీఐఎస్ ఇంకా వెల్లడించలేదు.
భారతీయులు లక్ష్యం కాదు: రూబియో
తమ దేశం కొత్తగా ప్రవేశపెట్టిన ఇమిగ్రేషన్ పాలసీని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు. ఇది ప్రపంచ స్థాయి సంస్కరణ చర్యే తప్ప భారత్‌ను లక్ష్యంగా చేసుకున్నది కాదని ఆయన స్పష్టం చేశారు. భారత్ పర్యటనకు వచ్చినా ఆయన మోదీతో సమావేశమైన అనంతరం శనివారం ఒక ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడారు. దేశం తీవ్ర వలస సంక్షోభంలో ఉందని ట్రంప్ అభిప్రాయపడిన క్రమంలో యూఎస్ ఇమిగ్రేషన్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసే చర్యలో ఒక భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు. ఇది భారత్‌కు సంబంధించినది కాదని, మొత్తం ప్రపంచానికి సంబంధించిన ప్రక్షాళన చర్య అని రూబియో పేర్కొన్నారు.