Gig Economy | వాషింగ్టన్, సెప్టెంబర్ 1: కొవిడ్ సంక్షోభం తర్వాత అమెరికాలో ఆందోళనకరమైన ధోరణి కనిపిస్తున్నది. జీవన అవసరాలను తీర్చుకునేందుకు అక్కడి ప్రజలు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేయాల్సి వస్తున్నది. ప్రధాన ఉద్యోగాలకు తోడుగా పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తున్న అమెరికన్ల సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. దీనినే ‘గిగ్ ఎకానమీ’ లేదా ‘సైడ్ హస్టిల్’ అని అంటున్నారు. జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు పెరగకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం వల్ల అమెరికన్లకు బహుళ ఉద్యోగాలు అత్యవసరంగా మారాయి.
వేతన వృద్ధిని ద్రవ్యోల్బణం స్థిరంగా దెబ్బతీస్తుండటంతో ఆదాయ లోటును భర్తీ చేసుకునేందుకు చాలా మంది ‘గిగ్ ఎకానమీ’పై ఆధారపడక తప్పడం లేదు. అమెరికా కార్మిక శాఖ నివేదిక ప్రకారం 2023 అక్టోబర్‌లో దాదాపు 84 లక్షల మందికి బహుళ ఉద్యోగాలు ఉన్నాయని, కొవిడ్ సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధిక సంఖ్య అని ‘సీబీఎస్ న్యూస్’ వెల్లడించింది. ఈ ధోరణిలో పురుషుల కంటే మహిళలే ముందున్నారని, 2023 అక్టోబర్‌లో అమెరికా జనాభాలో దాదాపు 6% మంది మహిళలు, 4.7% మంది పురుషులు బహుళ ఉద్యోగాలు చేశారని ఫెడరల్ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.