వాషింగ్టన్: అమెరికాలోని అలస్కా వద్ద 40 వేల ఫీట్ల ఎత్తులో చక్కర్లు కొడుతున్న ఓ గుర్తు తెలియని వస్తువును ఆ దేశ యుద్ధ విమానాలు పేల్చేవాయి. ఈ విషయాన్ని శ్వేతసౌధం తెలిపింది. ఆరు రోజుల క్రితమే చైనాకు చెందిన నిఘా బెలూన్ను కూడా అమెరికా విమానాలు కూల్చిన విషయం తెలిసిందే. అమెరికా గగనతలంపై తిరుగుతున్న ఆ వస్తువు గురించి పూర్తిగా తెలియదని వైట్‌హౌజ్ నేషనల్ సెక్యూర్టీ కౌన్సిల్ ప్రతినిధి జాన్ కెర్బీ తెలిపారు. 40వేల పీట్ల ఎత్తులో ఆ ఆబ్జెక్ట్ ఎగురుతున్నదని, దాని వల్ల పౌర విమానాలకు ప్రమాదం ఉన్నందున దాన్ని పేల్చివేసినట్లు అమెరికా తెలిపింది.
ఆ వస్తువును పేల్చివేయాలని అధ్యక్షుడు బైడెన్ మిలిటరీని ఆదేశించినట్లు కెర్బీ తెలిపారు. ఆ పేల్చివేత సక్సెస్ అయినట్లు వైట్‌హౌజ్ రిపోర్టర్లతో బైడెన్ పేర్కొన్నారు. అయితే వారం క్రితం పేల్చిన చైనా బెలూన్‌తో పోలిస్తే ఈ వస్తువు చాలా చిన్నగా ఉన్నట్లు కెర్బీ తెలిపారు. ఓ చిన్నపాటి కారు సైజులో అది ఉన్నట్లు వెల్లడించారు.