Barack Obama | అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలకు (Election Fraud) పాల్పడినట్లు అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామాపై (Barack Obama)సంచలన ఆరోపణల వేళ.. డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పోస్ట్ చేసిన ఓ వీడియో తీవ్ర చర్చనీయాంశమైంది. ఎఫ్‌బీఐ అధికారులు ఒబాను అరెస్టు చేసినట్లు ఏఐ వీడియోను తన సామాజిక మాధ్యమం ట్రూత్‌లో పోస్టు చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని పేర్కొన్నారు.
ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాను ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) అధికారులు అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది. ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేసినట్లుగా దానిని రూపొందించారు. ఆ సమయంలో ట్రంప్ నవ్వుతూ కనిపించారు. అనంతరం ఖైదీ దుస్తుల్లో ఉన్న ఒమాబా కటకటాల్లో ఉన్నట్లుగా అందులో చూపించారు. ఆ వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ.. చట్టానికి అధ్యక్షుడు అతీతుడే అన్నట్లుగా ఉంది. ఆ వెంటనే పలువురు రాజకీయ నేతలు చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు అని పేర్కొన్నట్లు ఉంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతున్నది.
బరాక్ ఒబామాపై అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ గతవారం సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 2016 ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించిన తర్వాత ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని, ఆయనన పాలనను నియంత్రించేందుకు ఆయన సన్నిహిత వర్గాలు అసత్య ప్రచారం చేశాయని పేర్కొన్నారు. రష్యా ఎన్నికల జోక్యంపై కల్పిత ఇంటెలిజెన్స్ నివేదికలు తయారు చేయించారని, తద్వారా ట్రంప్ అధ్యక్ష పదవికి అర్హత లేదని చూపించే ప్రయత్నం చేశారన్నారు. దీనికి సంబంధించి తనవద్ద సాక్ష్యాధారాలున్నాయని, వాటిని అమెరికా న్యాయవిభాగానికి (US Department of Justice) సమర్పించినట్లు వెల్లడించారు. తులసి ఆరోపణలు చేసిన మరుసటి రోజే ట్రంప్ ఏఐ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడం గమనార్హం.
Donald #Trump reposts AI-generated video depicting Barack #Obama being arrested.#MAGA | #USA
pic.twitter.com/crkL8bew9l— Shivanshi Singh (@Shivansshi) July 21, 2025