మలాబో, ఫిబ్రవరి 14: ఈక్వటోరియల్ గినియాను మార్బర్గ్ వైరస్ వణికిస్తున్నది. ఈ వైరస్ కారణంగా నెల రోజుల్లో తొమ్మిది మంది చనిపోయారు. ఎబోలా మాదిరి ప్రాణాంతకమైన ఈ వైరస్ వల్ల రక్త స్రావ జ్వరం వస్తుందని, దీని వ్యాప్తికి గల కారణాలను అన్వేషిస్తున్నామని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి అయెకాబా సోమవారం వెల్లడించారు. గాబన్, కామెరూన్ సరిహద్దులోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ వైరస్ వ్యాపిస్తున్నదని తెలిపారు. ఆ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేస్తున్నామని, 4325 మందిని క్వారంటైన్లో ఉంచామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తన బృందాలను గినియాకు పంపింది. ఆఫ్రికన్ గబ్బిలం(ఆఫ్రికన్ ఫ్రూట్ బ్యాట్) మార్బర్గ్ వైరస్‌ను వ్యాప్తి చేస్తుంది. కానీ దాని వల్ల అది అనారోగ్యం పాలవదు. ఈ వైరస్ వల్ల తీవ్ర జ్వరం, రక్త స్రావం కలుగుతాయి. ఈ వైరస్‌కు ఇంకా వ్యాక్సిన్ కనుగొనలేదు.