అబూజా: నైజీరియాలో దళాలు ఉగ్రవాదులను ఊచకోత కోశాయి. మే నెలలో ఇప్పటి వరకు 317 మంది అనుమానిత ఉగ్రవాదులను హతమార్చినట్లు నైజీరియా మిలిటరీ పేర్కొన్నది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో సుమారు 314 మందిని అరెస్టు చేసినట్లు కూడా మిలిటరీ వెల్లడించింది. నెలవారీ మీడియా సమావేశంలో మిలిటరీ ప్రతినిధి మైఖేల్ ఓంజా మాట్లాడుతూ.. తమ ఆపరేషన్ ద్వారా అపహరణకు గురైన సుమాఉ 221 మంది బాధితులను రక్షించినట్లు చెప్పారు. మరో 18 మంది అనుమానిత ఉగ్రవాదులు సరెండర్ అయినట్లు పేర్కొన్నారు. త్రివిధ దళాలకు చెందిన బృందాలు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లో పాల్గొన్నట్లు ఓంజా తెలిపారు. ఉగ్రవాదుల నుంచి 93 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమంగా నిర్వహిస్తున్న మూడు ఆయిల్ రిఫైనరీ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు చెప్పారు. వేల వేల లీటర్ల పెట్రోల్ ఉత్పత్తులను సీజ్ చేశారు. పశ్చిమ ఆఫ్రికా దేశమైన నైజీరియాలో ఉగ్రవాదం, దొంగతనాలు విపరీతంగా పెరిగిపోయినట్లు అధికారులు చెప్పారు.