ప్రస్తుతం ప్రపంచాన్ని ఒమిక్రాన్ వేరియంట్ ఎంతలా భయపెడుతుందో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతకు ముందు డెల్టా వేరియంట్ కూడా ఇదే మాదిరి ప్రపంచం మొత్తాన్ని గజగజలాడించింది.
ఈ క్రమంలో ఒమిక్రానే చివరి కరోనా వేరియంటా? అనే ప్రశ్నపై ప్రపంచంలోని పలువురు వైద్య నిపుణులు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) టెక్నిల్ లీడ్ మరియా వాన్ కెర్ఖోవే తాజాగా ఈ విషయంపై స్పందించారు. ఒమిక్రాన్ చివరి కరోనా వేరియంట్ కాదని ఆమె చెప్పారు.
‘‘మనం మాట్లాడుకునే చివరి కరోనా వేరియంట్ ఒమిక్రాన్ కాదు. తర్వాత వచ్చే కరోనా వేరియంట్ మరింత శక్తిమంతంగా ఉంటుంది. మరింత ఫిట్‌గా ఉంటుంది’’ అని ఆమె అభిప్రాయపడ్డారు. ఇది మరింత వేగంగా వ్యాప్తి చెందుతుందని, అదే సమయంలో శరీరంలోని ఇమ్యూనిటీ నుంచి మరింత బాగా తప్పించుకుంటుందని ఆమె వివరించారు. ఈ మాటలు ప్రస్తుతం మెడికల్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.