వెల్లింగ్టన్: న్యూజిలాండ్(New Zealand) ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ కార్యాలయ సిబ్బంది మైఖేల్ ఫోర్బ్స్‌పై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అతను సెక్స్ వర్కర్ల ఆడియోను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. వేశ్యలతో పాటు ఇతర మహిళలకు చెందిన ఫోటోలు, వీడియోలు అతని ఫోన్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ ఘటన నేపథ్యంలో మైఖేల్ ఫోర్బ్స్ రాజీనామా చేశారు. తమ కార్యాలయ సిబ్బంది ఇలాంటి చర్యలకు పాల్పడిన ఘటన పట్ల ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ షాక్‌కు గురయ్యారు.
మైఖేల్ ఫోర్బస్ పీఎం ఆఫీసులో డిప్యూటీ చీఫ్ ప్రెస్ సెక్రటరీగా ఉన్నారు. తన వల్ల వేదనకు గురైన మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు అతను పేర్కొన్నాడు. వేశ్యా గృహంలో ఓ వేశ్య వద్ద ఉన్న సమయంలో మైఖేల్ ఫోన్ ఆడియో రికార్డు చేస్తున్నట్లు తెలిసింది. అతను స్నానం చేస్తున్న సమయంలో కూడా ఆ ఫోన్ రికార్డింగ్ జరుగుతున్నట్లు వేశ్య చెప్పింది. ఇతర మహిళలతో జరిగిన లైంగిక చర్యలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా అతని ఫోన్లో ఉన్నట్లు తెలుస్తోంది. జిమ్, సూపర్‌మార్కెట్, ఇతర చోట్ల మహిళలను రహస్యంగా ఫోటోలు చిత్రీకరించాడతను.
గతంలో జర్నలిస్టుగా చేసిన మైఖేల్ ఫోర్బ్స్ ప్రవర్తన పట్ల విస్మయాన్ని వ్యక్తం చేశారు ప్రధాని లక్సన్. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారిని ఉపేక్షించేది లేదన్నారు. ప్రైవసీ చట్టాలను ఉల్లంఘించి.. మహిళలతో అనుచితంగా ప్రవర్తించడం సరికాదు అన్నారు. క్లయింట్ల వద్ద తమ ఫోటోలు ఉన్నట్లు వెల్లింగ్టన్లోని ఓ వేశ్యగహం నుంచి గతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఇటువంటి సంఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై చర్చించాల్సిన అవసరం ఉందని ప్రధాని లక్సన్ తెలిపారు.