ఆక్లాండ్: ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్ ( New Zealand )లో కోవిడ్ కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. దీంతో ఆ దేశంలో మూడు రోజుల లాక్డౌన్ విధించారు. అయితే నమోదు అయిన ఆ కేసును డెల్టా వేరియంట్‌గా నిర్ధారించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా దీన్ని ద్రువీకరించారు. ఆస్ట్రేలియాలో వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్.. తమ దేశానికి సోకినట్లు ప్రధాని జెసిండా తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా దడపుట్టిస్తున్న డెల్టా వేరియంట్.. మొదటిసారి న్యూజిలాండ్ లో బయటపడింది. ఇప్పటికే ఆ వైరస్ వేరియంట్ ఛాయలు సుమారు 142 దేశాల్లో నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల చెప్పింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ ఆరోగ్యశాఖ డైరక్టర్ జనరల్ ఆష్లే బ్లూమ్‌ఫీల్డ్ వార్నింగ్ ఇచ్చారు. ఆక్లాండ్‌లో సుమారు 120 డెల్టా వేరియంట్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఆష్లే తెలిపారు. ఎక్కడా డెల్టా కేసు వచ్చినా, దాన్ని గుర్తించడమే తమ పని అన్నారు.
అయితే న్యూజిలాండ్‌లోకి ఎలా డెల్టా కేసు వచ్చిందన్న కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు. నిజానికి వైరస్ కట్టడి కోసం న్యూజిలాండ్ తీవ్ర కృషి చేసింది. గత ఏడాది సరిహద్దుల్ని మూసివేసింది. స్వదేశీ ప్రయాణికులకు కూడా క్వారెంటైన్ విధించారు. న్యూజిలాండ్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతోంది. కేవలం 20 శాతం జనాభా మాత్రమే పూర్తి స్థాయిలో వ్యాక్సినేట్ అయ్యారు.