New missile | రష్యా (Russia) అమ్ములపొదిలో మరో సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. అణుశక్తితో నడిచే ‘బూరెవెస్ట్నిక్ (Burevestnik)’ క్షిపణిని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు (Russia president) వ్లాదిమిర్ పుతిన్ (Valdimir Putin) ప్రకటించారు. అపరిమితమైన పరిధి కలిగిన ఈ క్షిపణి మోహరింపు కోసం అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాలని సాయుధ దళాలను ఆదేశించారు.
కాగా రష్యా సైన్యం ఇటీవల ‘అణు’ విన్యాసాలు నిర్వహించింది. పుతిన్ ఆ విన్యాసాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రష్యా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఇతర సైనిక కమాండర్లతో ఆయన సమావేశమై మాట్లాడారు. పరీక్షల సమయంలో ‘బూరెవెస్ట్నిక్’ క్రూయిజ్ క్షిపణి 15 గంటలపాటు గాల్లోనే ఉందని, 14 వేల కిలోమీటర్లు ప్రయాణించిందని సైనికాధికారులు ఆయనకు తెలిపారు.
అంతకుముందు సైనిక ఉన్నతాధికారులతో పుతిన్ భేటీ అయ్యారు. రష్యా సాయుధ బలగాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ జనరల్ వాలెరీ గెరాసిమోవ్ నేతృత్వంలోని కమాండర్లతో సంభాషించారు. సుమారు 10 వేల మందికిపైగా ఉక్రెయిన్ సైనికులను తాము చుట్టుముట్టామని గెరాసిమోవ్ తెలిపారు. 31 బెటాలియన్లతో కూడిన ఉక్రెయిన్ సాయుధ దళాల బృందాన్ని తాము అడ్డుకున్నామని చెప్పారు.