బీజింగ్: బ్లడ్ కాన్సర్లు, ఇతర తీవ్ర వ్యాధులకు సులువైన, చౌకైన చికిత్సను చైనీస్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది అత్యంత ప్రత్యేకమైన, రోగికి తగినట్లుగా అందించగలిగే సెల్ థెరపీ. ఈ చికిత్సను సీఏఆర్-టీ అని పిలుస్తారు. ఇది ఇటీవల మొదలైన ఓ రకం ఇమ్యునోథెరపీ. ఆస్తా, ఆటోఇమ్యూన్ వ్యాధుల వంటి అస్వస్థతలకు ఈ విధానంలో చికిత్స చేయవచ్చు. అయితే, ఈ సెల్ థెరపీలు సంక్లిష్టమైనవి, ఖరీదైనవి కావడంతో చైనా శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని ప్రతిపాదించారు. తాము నేరుగా మానవ శరీరంలోనే యాంటీ క్యాన్సర్ సెల్స్‌ను ఉత్పత్తి చేయగలిగామని చెప్పారు. ఈ యాంటీ క్యాన్సర్ సెల్స్‌ను తొలిసారి నలుగురు రోగులకు చికిత్స చేయడానికి ఉపయోగించినట్లు తెలిపారు.
ఈ రోగులు అత్యంత సాధారణ బ్లడ్ క్యాన్సర్లలో రెండోది అయిన మల్టిపుల్ మయెలొమాతో బాధ పడుతున్నట్లు వెల్లడించారు. ఒకసారి ఈ చికిత్స చేయడానికి సుమారు రూ.1.20 కోట్లు ఖర్చవుతుందన్నారు. వూహన్లోని హువఝోంగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయం, టోంగ్జి మెడికల్ కాలేజ్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెమటాలజీ పరిశోధకుల నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. దీని నివేదికను ‘ది లాన్సెట్’ జర్నల్‌లో ప్రచురించారు.