జెరూసలేం: ఇరాన్‌లోని అణు కేంద్రాలపై దాడికి అమెరికా అధ్యక్షుడు ఎంతో సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రశంసించారు. ట్రంప్ చర్య ‘బలప్రయోగంతోనే శాంతి’ నెలకొంటుందన్న అంశాన్ని వెల్లడించిందని, భవిష్యత్తులో పశ్చిమాసియాలో శాంతికి, శ్రేయస్సుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. మీ ధర్మబద్ధమైన నిర్ణయం చరిత్రను మారుస్తుంది అని వ్యాఖ్యానించారు.
రైజింగ్ లయన్ ఆపరేషన్ ద్వారా ఇజ్రాయెల్ ఎన్నో అద్భుతాలు చేసిందని, కానీ అమెరికా తన చర్యలతో అజేయంగా నిలిచిందని పేర్కొన్నారు. ప్రపంచంలో ఏ దేశమూ చేయలేని పనిని అమెరికా చేసిందని కొనియాడారు. అత్యంత ప్రమాదకరమైన పాలకులను, అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నిలువరించిన ట్రంప్‌ను చరిత్ర జ్ఞాపకముంచుకొంటుందని వ్యాఖ్యానించారు. బలప్రయోగం ద్వారానే శాంతి అని తాను, ట్రంప్ తరచుగా చెప్పేవారిమని నెతన్యాహు గుర్తుచేశారు.