స్విట్జర్లాండ్: నెస్లే(Nestle) కంపెనీ భారీ నిర్ణయం తీసుకున్నది. రానున్న రెండేళ్లలో సుమారు 16 వేల మంది ఉద్యోగులను తొలగించనున్నది. స్విట్జర్లాండ్‌కు చెందిన ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయంతో ఆ కంపెనీ షేర్ ధరలు పెరిగాయి. నెస్లే సంస్థ బ్రాండ్లు నెస్‌ప్రెసో కాఫీ, పెరియర్ వాటర్ నుంచి ఉద్యోగులను తొలగిస్తారు. ప్రపంచం మారుతోందని, దానికి అనుగుణంగానే నెస్లే కంపెనీ కూడా వేగంగా మారాల్సి ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఫిలిప్ నవరాతిల్ ప్రకటనలో తెలిపారు.
చాలా కఠినమైన నిర్ణయమే కానీ, వ్యక్తులను తగ్గించడం తప్పనిసరిగా మారినట్లు ఆయన పేర్కొన్నారు. ఉద్యోగాలు తొలగిస్తున్న వార్తలు రాగానే ఆ కంపెనీ షేర్ ధరలు 8 శాతం పెరిగాయి. దీంతో యూరోప్‌లోనే జూరిచ్ స్టాక్ మార్కెట్లో ఉత్తమ ట్రేడింగ్ జరిగింది. కంపెనీలోని ఆరు శాతం మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగుల్లో 12 వేల మంది వైట్‌కాలర్ జాబ్స్ ఉన్నాయి. వీళ్లను తొలగించడం వల్ల కంపెనీకి బిలియన్ స్విస్ ఫ్రాంక్‌లు సేవ్ కానున్నాయి.
కంపెనీకి చెందిన ప్రొడక్షన్, సప్లై చెయిన్‌లో ఇప్పటికే నాలుగు వేల మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలైంది. 2027 నాటికి మూడు బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఆదా చేయాలన్న ఉద్దేశంతో నెస్లే కంపెనీ ఉన్నట్లు నవరాతిల్ తెలిపారు.