వెవీ : తన సహోద్యోగినితో సీక్రెట్ ఎఫైర్ కలిగి ఉన్నారన్న కారణంగా నెస్లే సంస్థ తన సీఈవో లారెంట్ ఫ్రెయిక్స్ను ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ సంబంధం గురించి ఆయన కంపెనీకి తెలియజేయలేదని, ఇది నియమాల ఉల్లంఘన అని సోమవారం విడుదల చేసిన ఒక నోటిఫికేషన్లో పేర్కొంది. ఫ్రెయిక్స్ స్థానంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంపెనీ కాఫీ వ్యూహాత్మక వ్యాపార యూనిట్ అధిపతి ఫిలిప్ నవ్రాటిల్ను కొత్త సీఈవోగా నియమించినట్టు చెప్పింది.
ఫ్రెయిక్స్ తన వ్యక్తిగత సహాయకురాలితో ఎఫైర్ కలిగి ఉన్నట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్టు కంపెనీ తెలిపింది. న్యాయవాదుల సాయంతో కంపెనీ అధ్యక్షుడు పాల్ బల్కీ, లీడ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పాబ్లో ఇస్లా ఈ దర్యాప్తును చేపట్టినట్టు వెల్లడించింది. ఈ సందర్భంగా పాల్ బల్కీ మాట్లాడుతూ ‘ఈ నిర్ణయం అవసరం. నెస్లే విలువలు, సూత్రాలు మాకు ఎంతో ముఖ్యం. 40 ఏండ్ల పాటు లారెంట్ చేసిన సేవలకు ధన్యవాదాలు’ అని తెలిపారు.