ఖట్మండూ: నేపాల్ పార్లమెంట్, అసెంబ్లీకి జరిగిన సాధారణ ఎన్నికల పోలింగ్ లెక్కింపు కొనసాగుతున్నది. తాత్కాలిక ప్రధాని, నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవ్బా వరుసగా ఏడోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. 77 ఏండ్ల దేవ్బా.. దడేల్‌ధురా నియోజకవర్గం నుంచి పోటీచేసిన ఆయన తన సమీప ప్రత్యర్థి సాగర్ ధకల్పై 25,534 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. స్వతంత్ర అభ్యర్థి అయిన సాగర్‌కు 1302 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
నేపాల్ పార్లమెంట్, ఏడు ప్రొవిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు గత ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఇందులో 61 శాతం పోలింగ్ నమోదయింది. సోమవారం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. వారం తర్వాత ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నది. ఇప్పటివరకు దేవ్‌బాకు చెందిన నేపాలీ కాంగ్రెస్ ముందంజలో ఉన్నది. ఖాట్మండులోని మూడు స్థానాలతోపాటు మొత్తం 10 సీట్లలో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో 46 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. ఇక సీపీఎన్-యూఎంఎల్ పార్టీ మూడు స్థానాలో గెలుపొందగా, 42 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నది.
నేపాల్ పార్లమెంట్‌లోని దిగువసభలో మొత్తం 275 స్థానాలు ఉండగా, 165 మందిని ఓటింగ్ ద్వారా ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. మరో 110 స్థానాలకు నైష్పత్తిక ప్రాతినిధ్య విధానంలో ప్రతినిధులు నియమితులవుతారు. ఇక ప్రావిన్షియల్ అసెంబ్లీలలో 550 స్థానాలు ఉన్నాయి. వీటిలో 330 స్థానాలకు ప్రత్యక్ష ఎన్నికలు జరుగగా, మరో 220 మంది ప్రతినిధులు దామాషా పద్ధతిలో ఎన్నుకుంటారు.
నేపాల్‌లో రాజకీయ అస్థిరత సర్వసాధారణంగా మారింది. 1990 లో ఇక్కడ ప్రజాస్వామ్యం ఏర్పడింది. దాంతో 2008 లో రాచరికం రద్దయింది. 2006 లో అంతర్యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ప్రధాని కూడా పూర్తి పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. తరచూ నాయకత్వ మార్పులు, రాజకీయ పార్టీల మధ్య అంతర్గత పోరు కారణంగా అభివృద్ధి మందగిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నేపాల్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు 30 ప్రభుత్వాలు మారాయి. 2008 లో రాచరికం ముగిసిన తర్వాత కూడా 10 ప్రభుత్వాలు మారడం విశేషం.
#NepalGeneralElections | Sher Bahadur Deuba, Prime Minister of Caretaker Government & President of ruling Nepali Congress elected for the 7th consecutive time from the home district of Dhankuta with 25,534 votes. His competitor Sagar Dhakal got 13,042 votes.
(Pic: PM's Twitter) https://t.co/bojoIO1iXo pic.twitter.com/6grf7dkv1v
— ANI (@ANI) November 23, 2022