Nepal PM : నేపాల్ తొలి మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించిన సుశీల కర్కి (Sushila Karki) అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం ప్రధాని కార్యాలయానికి వెళ్లిన సుశీల మీడియాతో మాట్లాడారు. తన తొలి ప్రసంగంలోనే ఆమె తమ ప్రభుత్వ ఉద్దేశాలను దేశ ప్రజలకు స్పష్టంగా తెలియజేశారు. తనకు, తన మంత్రివర్గానికి అధికారం, పదవలపై ఆశలేదని.. వచ్చే ఆరు నెలలు మాత్రమే తాము కొనసాగుతామని ఆమె వెల్లడించారు.
‘నాకు, నా టీమ్‌కు పదవులపై ఆశలేదు. అధికారం అనుభవించాలనే ఉద్దేశం అంతకన్నా లేదు. మేము ఆరు నెలల కంటే ఎక్కువ సమయం పదవిలో ఉండము. ఎన్నికల తర్వాత కొత్తగా ఎన్నికైన పార్లమెంట్‌కు అధికారాన్ని బదలాయిస్తాం. మరో విషయం మీ మద్దతు లేకుండా మేము ఎక్కువ రోజులు కొనసాగలేము. కేవలం 27 గంటల్లోనే నిరసనల కారణంగా దేశంలో విప్లవాత్మక మార్పు వచ్చింది. అల్లర్ల పేరుతో నిరసనకారులు పలు ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడమే కాకుండా నిప్పు పెట్టారు. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం.. ఒక కుట్రలో భాగంగా జరిగింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించే విషయాన్ని ప్రభుత్వం ఆలోచిస్తుంది’ అని ప్రధాని సుశీల తెలిపారు.
I heartily congratulate Shushila Karki ji on being appointed as the first woman Prime Minister of Nepal. I hope your work will help in changing the face of the country. Jay Nepal 🇳🇵🇳🇵 pic.twitter.com/N0gUssZLw1
— Nihal Haidar🇳🇵🇵🇸 (@NihalHaida5995) September 12, 2025
అవినీతిమయమైన కేపీ ఓలీ ప్రభుత్వాన్ని గద్దెదించిన జెన్ జెడ్ పోరాటాన్ని ఆమె కొనియాడారు. అల్లర్లు హింసాత్మకంగా మారి 51 మంది మృతి చెందడంపట్ల విచారం వ్యక్తం చేశారామె. పోలీసుల కాల్పుల్లో మరణించిన వీళ్లందరిని అమరులుగా గుర్తిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. అంతేకాదు మృతుల కుటుంబాలకు 1 మిలియన్ నేపాలీ రూపీస్(భారత కరెన్సీలో రూ.6.25 లక్షలు) నష్టపరిహారంగా చెల్లిస్తామని సుశీల పేర్కొన్నారు. అయితే.. స్థానిక హిమాలయన్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం ఇటీవలి అల్లర్లలో మరణించినవారి సంఖ్య 72కు చేరింది. వీళ్లలో 59 మంది నిరసనకారలు కాగా.. 10 మంది ఖైదీలు, ముగ్గురు పోలీసు అధికారులు ఉన్నారు.
దేశంలో నెలకొన్న అవినీతి పాలన, నాయకుల బంధుప్రీతికి తోడూ సోషల్ మీడియాపై నిషేధం విధించడంపై నేపాల్ యువతరం భగ్గుమంది. ప్రధాని కేపీ ఓలీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 8న శాంతియుతంగా ఆందోళనలకు దిగారు జెన్ జెడ్. అయితే.. వీళ్లను అణచివేసేందుకు అదేరోజు పోలీసులు కాల్పులు జరపగా 19 మరణించారు. దాంతో.. ఆగ్రహించిన యువత నిరసనలను హింసాత్మకంగా మార్చాయి. నేపాల్ పార్లమెంట్, సుప్రీంకోర్టుతో పాటు అధ్యక్ష భవనాన్ని ముట్టించిన ఆందోళనకారులు వాటన్నింటికీ నిప్పు పెట్టారు. దాంతో.. సైన్యం ఆదేశాలమేరకే ప్రధాని పదవికి కేపీ ఓలీ రాజీనామా చేశారు.
ప్రధాని కేపీ శర్మ ఓలీ (KP Sharma Oli) ప్రభుత్వం గద్దెదిగిన తర్వాత తాత్కాలిక ప్రధాని పదవికి ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. మాజీ జస్టిస్ సుశీల కర్కితో పాటు ఇంజనీర్ కుల్మాన్ ఘిసింగ్(Kulman Ghisingh), ఖాఠ్మాండ్ మేయర్ బలేంద్ర షా(Balendra Shah)లో ఒకరిని ఎంచుకోవడంపై అభిప్రాయబేధాలు తలెత్తాయి. అయితే.. శుక్రవారం సాయంత్రం నాటికి సైన్యం, అధ్యక్షుడు, ఆందోళనకారుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మాజీ జస్టిస్ అయిన సుశీలను తాత్కాలిక ప్రధాని చేసేందుకు అందరూ ఆమోదం తెలిపారు