ఖాట్మండు: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న నేపాలీ యువ క్రికెటర్ సందీప్ లామిచానే జ్యుడీషియల్ కస్టడీని మరోసారి పొడిగించారు. కేసులో తుది తీర్పు వచ్చేవరకు లామిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది. కాగా, సందీప్ లామిచానే తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో ఓ 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లామిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు.
జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉన్న సందీప్ లామిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా పక్కనపెట్టింది. అయినా సందీప్ వెంటనే స్వదేశానికి రాలేదు. అక్టోబర్ 5న రావడంతో పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు అతడికి ముందుగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆ తర్వాత కస్టడీని పొడిగిస్తూ వచ్చింది. చివరగా కేసులో తుదితీర్పు ఇచ్చేవరకు సందీప్‌కు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.