కేప్ కెనవరల్: దాదాపు అర్ధ శతాబ్దం తరువాత అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం (నాసా) మొదటిసారిగా చంద్రుడి వద్దకు మానవులను పంపే ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టింది. నలుగురు వ్యోమగాములతో కూడిన ‘ఓరియన్’ రాకెట్‌ను బుధవారం ప్రయోగించింది. వేల సంఖ్యలో చేరి వచ్చిన ప్రజల కేరింతల మధ్య కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి 32 అంతస్తుల రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ చంద్రుడి ఉపరితలానికి అత్యంత సమీపంగా వెళ్లి దానిని చుట్టి తిరిగి రానుంది.
పది రోజులపాటు సాగనున్న ఈ యాత్రలో ముగ్గురు అమెరికన్లతోపాటు కెనడాకు చెందిన ఒక వ్యోమగామి ఉన్నారు. నలుగురు వ్యోమగాముల్లో ఒకరు మహిళ కాగా మరొకరు నల్ల జాతీయుడు. ఈ బృందానికి కమాండర్‌గా రీడ్ వైజ్మన్ వ్యవహరిస్తుండగా.. ఆయనకు తోడుగా పైలట్ విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, కెనడాకు చెందిన జెరిమీ హాన్సెన్ ఉన్నారు. ఈ ప్రయోగం జరిగిన వెంటనే నాసా అడ్మినిస్ట్రేటర్ జేర్డ్ ఐజాక్మన్ మీడియాతో మాట్లాడుతూ.. జాబిల్లి వద్దకు వ్యోమగాములను పంపే పనిని నాసా పునఃప్రారంభించింది అని చెప్పారు.