న్యూఢిల్లీ: ఉక్రెయిన్-రష్యా ఉద్రిక్తతలపై గురువారం రాత్రి రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ ఫోన్లో మాట్లాడారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి పుతిన్ మోదీకి వివరించారు. ఈ క్రమంలో నాటో, రష్యా మధ్య నెలకొన్న భిన్నాభిప్రాయాలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ప్రధాని సూచించారు. హింసాత్మక ఘటనలకు వెంటనే ముగింపు పలుకాలని విజ్ఞప్తి చేశారు. చర్చల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషించాలని సూచించారు.
భారత్ తటస్థ వైఖరి
ఉక్రెయిన్-రష్యా పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, ఈ విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తుందని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. శాంతియుత మార్గాల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. భారతీయులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నది.