లాహోర్: పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో శుక్రవారం దారుణ మూకదాడి చోటుచేసుకుంది. ఇస్లాం మతాన్ని, తమ దైవాన్ని కించపరిచాడని ఆరోపిస్తూ శ్రీలంక జాతీయుడ్ని కొట్టిచంపి, అనంతరం ఆ మృతదేహాన్ని తగులబెట్టారు. శ్రీలంకకు చెందిన 40 ఏండ్ల ప్రియాంత కుమార.. సియాల్కోట్ జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కుమార ఖురాన్ పద్యాలు రాసి ఉన్న టెహ్రీక్-ఈ-లబ్బాయిక్(టీఎల్పీ) అనే పార్టీ పోస్టర్‌ను చింపి డస్ట్‌బిన్‌లో పడేశాడని ఆరోపిస్తూ ఆ పార్టీ మద్దతుదారులు మూకదాడికి పాల్పడ్డారని స్థానిక పోలీసులు పేర్కొన్నారు. ఆఫీస్ కార్యాలయానికి అంటించి ఉన్న పోస్టర్‌ను కుమార్ చింపడం కొంత మంది ఫ్యాక్టరీ కార్మికులు చూశారని తెలిపారు. ఈ విషయం దావానలంలా ఇతర ప్రాంతాలకు కూడా పాకడంతో పెద్ద ఎత్తున గుంపు ఫ్యాక్టరీ బయట గుమిగూడింది. వీరిలో టీఎల్పీ పార్టీ కార్యకర్తలే అధికంగా ఉన్నారు. ఫ్యాక్టరీలో ఉన్న కుమారను బయటకు లాక్కొచ్చి చిత్రహింసలు పెట్టి చంపేశారు. పోలీసులు రాకముందే మృతదేహాన్ని తగులబెట్టారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 100 మందిని అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ఇటీవల కుదుర్చుకున్న రహస్య ఒప్పందం మేరకు టీఎల్పీపై నిషేధం ఎత్తివేయడంతో పాటు ఆ పార్టీ చీఫ్ సాద్ రిజ్వితో పాటు 1,500 మంది కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారు.