Decapitated | వాషింగ్టన్: ప్రమాదవశాత్తు చేతి వేళ్లు లేదా కాలి వేళ్లు తెగిపడితే.. వాటిని తిరిగి శరీరానికి జత చేయటం (సర్జరీ ద్వారా) చాలా అరుదు. వైద్య పరంగా చాలా కష్టసాధ్యమైంది. అలాంటిది అమెరికన్ వైద్యులు, తెగిపోయిన ఓ మహిళ తలను.. తిరిగి అతికించారు! 37 శస్త్ర చికిత్సలు నిర్వహించి సదరు మహిళ పుర్రెను వెన్నెముకతో కలపటంలో అమెరికా వైద్యులు సక్సెస్ అయ్యారు. ‘ద సన్’ వార్తా కథనం ప్రకారం, ఇల్లినాయిస్కు చెందిన మేగాన్ కింగ్ తన 16వ ఏట (2005) ఓ ఫుట్‌బాల్ గేమ్‌లో తీవ్రంగా గాయపడింది.
ఒక్క ఏడాదిలో వైద్యులు ఆమెకు 30కిపైగా సర్జరీలు చేశారు. ఈ క్రమంలో 2016లో ఆమె తలభాగానికి వైద్యులు ఓ సర్జరీ చేశారు. పుర్రెను తలలో చేర్చేందుకు ‘హ్యాలో బ్రేస్’ అనే పరికరాన్ని స్క్రూలతో బిగించారు. ఆ తర్వాత ఈ స్క్రూను తొలగిస్తుండగా.. ఆమె పుర్రె మళ్లీ వెన్నెముక నుండి దాదాపు వేరుపడింది. దీనిని సాధారణంగా అంతర్గత శిరచ్ఛేధంగా పేర్కొంటారు. ఆమె పుర్రెను న్యూరో సర్జన్ చేతితో పట్టుకున్న సందర్భాలూ ఉన్నాయి. తిరిగి ఆమె పుర్రెను వెన్నెముకకు అమర్చడానికి అత్యవసర శస్త్ర చికిత్స చేయాల్సి వచ్చింది. మొత్తం 37 సర్జరీల తర్వాత ‘స్పైనల్ ఫ్యుజన్’ అనే ప్రక్రియ ద్వారా మేగాన్ పుర్రెను ఆమె వెన్నెముకకు శాశ్వతంగా అమర్చారు.