టెహ్రాన్, మార్చి 28: పశ్చిమాసియా యుద్ధం సామాన్య పౌరుల జీవితాల్లో చిచ్చు రేపింది. ఎప్పుడు ఏ బాంబు మీద పడుతుందో తెలియని స్థితిలో వేలాది మంది పౌరులు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని వలస బాట పడుతున్నారు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, పక్క దేశానికి ప్రాణ భయంతో పరుగులు పెడుతున్నారు. ఇరాన్ నుంచి లెబనాన్ దాకా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ఇక్కడ ఉండి ప్రాణాలు పోగొట్టుకునే కన్నా స్వదేశానికి పోయి కలో గంజో తాగొచ్చంటూ పలువురు సొంత దేశాలకు పయనమవుతున్నారు.
ఇరాన్‌తో యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధం ఇప్పట్లో తగ్గే పరిస్థితులు కన్పించకపోవడంతో పలువురు ఇరాన్ దేశస్థులు ఇతర దేశాలకు వలసపోతున్నారు. అలాగే అక్కడ నివసిస్తున్న విదేశీయులు స్వదేశాలకు పారిపోతున్నారు. యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఈ నెల 26 వరకు 51,500 మంది ఇరానీయులు తుర్కియేలోకి ప్రవేశించారని ఐరాస కాందిశీకుల ఏజెన్సీ వెల్లడించింది. ఇదే సమయంలో 24,500 మంది లెబనీయులు సిరియాలోకి ప్రవేశించారు.
సంక్షోభం ప్రారంభమైనప్పటి నుంచి 1.65 లక్షల మంది సిరియన్లు, 41,900 మంది అఫ్ఘన్లు స్వదేశాలకు తిరిగి వచ్చేశారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రారంభమైన తర్వాత అనేక దేశాల్లో అంతర్గత స్థానభ్రంశం పెరిగింది. లెబనాన్‌లో అత్యధికంగా 10.49 లక్షల మంది స్థానభ్రంశం చెందారు. అలాగే అఫ్ఘాన్‌లో 1.15 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. కాగా, యుద్ధం కారణంగా మార్చి 26 వరకు ఇరాన్లో 1,094, లెబనాన్‌లో 1,937, ఇరాక్‌లో 89, సిరియాలో నలుగురు మరణించారు.