ఆమ్స్టర్డామ్, ఫిబ్రవరి 13: అధునాతన సాంకేతిక ప్రపంచంలో ఏఐ ఒక అద్భుతం. ఇది విద్యార్థుల హోంవర్క్ నుంచి ఇంజినీరింగ్ నిపుణుల కోడింగ్ వరకు అన్ని పనులు చకచకా చేసిపెట్టడమే కాదు.. వర్చువల్ మనుషులనూ సృష్టిస్తున్నది. ఇంకా విచిత్రమేమిటంటే ఆ ఏఐ క్రియేటెడ్ క్యారెక్టర్స్‌తో కొందరు ప్రేమలో మునిగి తేలుతున్నారు. స్పానిష్‌కి చెందిన ఆర్టిస్ట్ అలీసియా ఫ్రేమిస్ ఈ కోవకు చెందినవారే. ఈమె ఏకంగా ఏఐ క్రియేటెడ్ హోలిగ్రాఫిక్ పార్ట్నర్ను పెళ్లాడుతున్నట్టు ప్రకటించింది. కేవలం ఇదేదో వైరల్ అవ్వడానికి మాత్రమే అనుకొంటే మీరు పొరబడ్డట్టే. ఆమె ఏఐ హోలోగ్రామ్‌తో వివాహం కోసం నెదర్లాండ్స్‌లోని రోటెర్డామ్లో వేదికను కూడా సిద్ధం చేసుకొన్నది. పెండ్లి బట్టలు డిజైన్ చేయించుకొన్నది. తన భాగస్వామి పేరు ఐలెక్స్ అని అలీసియా సోషల్ మీడియాలో విడుదల చేసిన వీడియోలో వెల్లడించింది. ఈ వీడియోలో వీరిద్దరూ కలిసి భోజనం చేస్తున్నారు. అనంతరం అలీసియా ఫ్రిజ్ వైపు వెళ్తుండగా.. ఐలెక్స్ పాత్రలు కడుగుతూ కనిపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇక అందరి భవిష్యత్తు ఇలాగే ఉండబోతున్నదని ఓ నెటిజన్ కామెంట్ చేయగా.. వర్చువల్ మనుషులతో వైవాహిక బంధం కొన్నాళ్లే బాగుంటుంది.. భౌతిక ప్రపంచంలో మనకు తోడుగా ఉండేందుకు నిజమైన హ్యుమన్ పార్ట్నర్ ఉండాల్సిందే అంటూ మరొకరు తన అభిప్రాయాన్ని వెల్లడించారు.