Cancer | న్యూయార్క్, అక్టోబర్ 24: ఆరోగ్యకర కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలపై దాడి చేసే ఔషధాన్ని న్యూయార్క్ యూనివర్సిటీ పరిశోధకులు అభివృద్ధి చేశారు. సహజ జీవ సంబంధమైన వ్యవస్థల నుంచి ఈ మందును తయారుచేశారు. ఇది హర్ 2(మానవ బాహ్య చర్మ పెరుగుదల కారక గ్రాహకం 2)గా పిలిచే ముటెంట్ క్యాన్సర్ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకుంటుంది. దగ్గరలో ఉన్న ఆరోగ్యకర కణాలకు ఎలాంటి హాని చేయకుండా క్యాన్సర్ కణాలపై ఈ ఔషధం దాడి చేస్తుంది.
అయితే ఈ ఔషధం అభివృద్ధి ప్రారంభ దశలోనే ఉందని, హర్2 మ్యుటేషన్లతో తక్కువ సైడ్ ఎఫెక్ట్‌లతో క్యాన్సర్ రోగులకు చికిత్స చేసే కొత్త పద్ధతులకు ఇది దారి తీస్తుందని పరిశోధకులు తెలిపారు. పరిశోధకులు అభివృద్ధి చేసిన కొత్త ప్రొటీన్-ఇంజినీరింగ్ సాంకేతికత కేవలం ముటెంట్ హర్2లను గుర్తించే యాంటీబాడీలను మాత్రమే అభివృద్ధి చేస్తుంది. ఎలుకల్లో చేసిన ఈ పరిశోధన విజయవంతమైందని.. మనుషుల్లో వచ్చే ఫలితాలపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.