Marriage | బీజింగ్, ఫిబ్రవరి 10: సోలో బతుకే సో బెటర్ అంటున్నారు చైనా యువత. ఆ దేశంలో పెండ్లిండ్ల సంఖ్య కనిష్ఠ స్థాయికి పడిపోయింది. విడాకులు తీసుకుంటున్న జంటలు పెరిగిపోతున్నాయి. పెండ్లయిన యువత పిల్లల్ని కనేందుకు ఇష్టపడటం లేదు. దీంతో జనాభా సంక్షోభంపై చైనా సర్కారు ఆందోళన చెందుతున్నది. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనాలో దేశ జనాభాను పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ తాజాగా విడుదల చేసిన డాటా ప్రకారం గత ఏడాది నమోదైన వివాహాల సంఖ్య 61 లక్షలకు పడిపోయింది. ఇది అంతకు ముందు సంవత్సరం కన్నా 20.5 శాతం తక్కువ. కొవిడ్ సంక్షోభం తర్వాత 2023లో ఈ వివాహాల సంఖ్య 77 లక్షలుగా నమోదైంది. వివాహాల నమోదు ప్రారంభమైన తర్వాత 2024లో నమోదైన సంఖ్యే అత్యల్పం. 2013లో నమోదైన గరిష్ఠ వివాహాల సంఖ్యలో ఇది సగం కన్నా తక్కువ.
జనాభా తగ్గుదలపై చైనా ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ఒక పక్క వృద్ధుల సంఖ్య పెరిగిపోతుండగా, యువత శాతం తగ్గిపోతున్నది. ఇది భవిష్యత్తులో తీవ్ర అసమానతలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే చైనాలో విడాకుల సంఖ్య కూడా స్పల్పంగా పెరిగినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. 2024లో 26 లక్షల మంది విడాకులకు దరఖాస్తు చేశారు. 2023తో పోలిస్తే ఇది 28 వేలు ఎక్కువ. గత ఏడాది స్వల్ప మెరుగుదల మినహాయిస్తే చైనా జనాభా వరుసగా మూడేండ్ల పాటు తగ్గుతూ వచ్చింది. పనిచేసే వర్గంగా పేర్కొనే 16-59 ఏండ్ల వయస్కుల సంఖ్య 2024లో 68.3 లక్షలు తగ్గింది. అదే సమయంలో 60 అంతకు పైబడి వయస్కుల సంఖ్య పెరిగింది. మొత్తం జనాభాలో వీరి సంఖ్య 22 శాతం ఉంది.
యువతీ యువకుల వివాహాలకు, వారు పిల్లలను కనడానికి చైనా పాలకులు పలు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. యువతకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు అవగాహన శిబిరాలు ఏర్పాటు చేసి పెండ్లి చేసుకుని పిల్లల్ని కనాలంటూ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నది. అంతేకాకుండా ప్రభుత్వమే డేటింగ్ ఈవెంట్లు, సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నది. సంప్రదాయంగా అమ్మాయి తరపు వారికి పెద్దమొత్తంలో కట్నం తరహాలో ఇచ్చే ‘వధువు ధర’ను సైతం తగ్గించి పేద పెండ్లి కొడుకులు ఇబ్బంది పడకుండా ప్రయత్నిస్తున్నది. స్థానిక ప్రభుత్వాలు కొత్తగా పెండ్లి చేసుకున్న జంటలకు నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్నాయి. ఇన్ని చేసినా యువత మనసు మార్చడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయనే చెప్పవచ్చు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగం, ఆర్థిక వ్యవస్థ మందగించడం, జీవన వ్యయం పెరిగిపోవడంతో చైనా యువత వివాహాల పట్ల అంత ఆసక్తి చూపడం లేదు.