లండన్, జూలై 17: సముద్రంలో కొట్టుకుపోయిన ఓ 30 ఏండ్ల వ్యక్తిని పిల్లలు ఆడుకునే ఫుట్‌బాల్ రక్షించింది. ఆ బంతి సాయంతోనే అతను ఏకంగా 18 గంటలపాటు నీటిలో తేలియాడుతూ ఉన్నాడు. ఇవాన్, అతని స్నేహితుడు ఈత కొట్టేందుకు ఇటీవల గ్రీస్‌లోని ఓ బీచ్‌కు వెళ్లారు. ప్రమాదవశాత్తూ సముద్రపు అలల్లో ఇద్దరూ కొట్టుకుపోయారు. తీరప్రాంత గస్తీ సిబ్బంది ఎంత వెతికినప్పటికీ వీరి జాడ కనిపించలేదు. కెరటాలతో పాటు కొట్టుకుపోతున్న ఇవాన్‌కు సముద్రం మధ్యలో ఓ ఫుట్‌బాల్ కనిపించింది. అంతే, దాన్నే ఆధారంగా చేసుకొన్న అతను సుమారు 18 గంటలపాటు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాపాడేవారి కోసం ఎదురుచూశాడు. చివరకు గస్తీ సిబ్బంది సాయంతో ఒడ్డుకు చేరాడు. కాగా ఇవాన్‌ను కాపాడిన బంతిని ఇద్దరు చిన్నారులు సముద్రంలో పోగొట్టుకున్నారని స్థానిక మీడియా వెల్లడించింది. ఇవాన్ స్నేహితుడి జాడ ఇంకా తెలియరాలేదు.