కాంపో మాగ్రో: ఓ 22 ఏళ్ల యువకుడు చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. భార్యతో కాపురానికి సంబంధించి ఎన్నో కలలు కన్నాడు. కానీ అతని కలలు కల్లలే అయ్యాయి. పెళ్లయిన కొన్నాళ్లకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. భార్య పోరు తట్టులేక అతడు విసిగిపోయాడు. చివరికి తన భార్యతో తనకు విడాకులు ఇప్పించాలంటూ కోర్టుకు వెళ్లాడు. ఇరువురి వాదనలు విన్న కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. దాంతో ఆ యువకుడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఇక పెళ్లి జోలికి వెళ్లకుండా జీవితాన్ని ఎంజాయ్‌గా గడపాలని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఓ టూరిస్టు స్పాట్‌కు వెళ్లి అక్కడ బంగీ జంప్ చేశాడు. అయితే అతను 70 అడుగుల ఎత్తులో ఉండగా తాడు తెగి నీటి మడుగులో జారి పడిపోయాడు. ఈ ప్రమాదంలో అతని మెడ, నడుము ఎముకలు విరిగిపోయాయి. ముఖంపైన, వీపుపైన తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన బ్రెజిల్లో జరిగింది. రఫేల్ డోస్ సాంటోస్ టోస్టా అనే బ్రెజిల్ యువకుడే ఈ ఘటనలో బాధితుడు. బ్రెజిల్‌లోని కాంపో మాగ్రోలోగల లగోవా అజుల్ అనే టూరిస్ట్ స్పాట్ వద్ద గత ఫిబ్రవరి 11న ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాదం జరిగి మూడు నెలలైనా రఫేల్ ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. నిటారుగా నిలబడలేకపోవడం, సొంతంగా లేవలేకపోవడం, మెడ, వెన్నెముక, కాళ్లు, భుజాల్లో తీవ్రమైన నొప్పి కారణంగా ఫిజియోథెరపిస్టుల సమక్షంలో అతనికి చికిత్స కొనసాగుతున్నది. ఘటన గురించి బాధితుడు రఫేల్ మాట్లాడుతూ.. పెళ్లికి ముందు తాను చాలా కామ్‌గా ఉండేవాడినని, పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోయానని చెప్పాడు. భార్యతో విడాకులు రాగానే ఇకపై జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నానని, అప్పటి నుంచి సాధ్యమైనంతగా ఎంజాయ్ చేస్తూ వచ్చానని, ఈ క్రమంలోనే ప్రమాదం బారినపడ్డానని తెలిపాడు.
ప్రస్తుతం తన జీవితం మునుపటిలా లేదని, నా తల్లి, కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినకుండా ఎంజాయ్ అంటూ తిరగడంతో తగిన శాస్తే జరిగిందని వ్యాఖ్యానించాడు. ఎటు కదిలినా నొప్పులే ఉన్నాయని, దాంతో కనీసం నిద్ర కూడా సరిగా పోలేకపోతున్నానని చెప్పాడు. నిద్రపోతే పీడకలలు వస్తుండటంతో నిద్ర పోవాలంటేనే భయంగా ఉందని తెలిపాడు. బంగీజంప్కు ముందు ఈ తాడు నా బరువును ఆపగలదా అని జోక్ చేశానని, అన్నట్టే తాడు తెగి ప్రమాదానికి కారణమైందని రఫేల్ గుర్తు చేసుకున్నాడు. అంతపెద్ద ప్రమాదం జరిగినా దేవుడి దయవల్ల ప్రాణాలతో ఉన్నందుకు సంతోషమని చెప్పాడు.
https://content.jwplatform.com/previews/aD8Idi5v