క్వీన్స్లాండ్: ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరాల ప్రకారం 2020లో ప్రపంచవ్యాప్తంగా 24కోట్ల మందికిపైగా మలేరియాతో బాధపడ్డారు. 6 లక్షల మంది మృతిచెందారు. మలేరియాను రక్తపరీక్ష ద్వారానే గుర్తించొచ్చు. ఒకేచోట ఎక్కువమందికి లక్షణాలు ఉన్నప్పుడు ఈ పద్ధతిలో వ్యాధి నిర్ధారణ చాలా ఆలస్యం అవుతుంది. అయితే, దీనికి చెక్ పెట్టారు ఆస్ట్రేలియా పరిశోధకులు. సూదిగుచ్చకుండా నిర్వహించే మలేరియా టెస్ట్‌ను కనుగొన్నారు. ఈ పద్ధతిలో ఓ పరికరాన్ని ఉపయోగించి వ్యక్తి చెవి లేదా వేలిపై 5-10 సెకన్లపాటు హానిచేయని ప్రకాశించే పరారుణ కాంతిపుంజాన్ని (ఇన్ఫ్రారెడ్ బీమ్) ప్రసరింపజేస్తారు. కంప్యూటర్ అల్గారిథమ్ ఆధారంగా మలేరియాను నిర్ధారిస్తారు. ఊరు మొత్తం మలేరియాతో బాధపడ్డా ఈ పద్ధతిలో వేగంగా, కచ్చితత్వంతో వ్యాధి నిర్ధారణ చేయొచ్చని పరిశోధకులు తెలిపారు. ఈ పరీక్ష రసాయన, సూదిరహితమని, చర్మంపై హానికరంకాని ఇన్ఫ్రారెడ్ లైట్‌ను ఫ్లాష్‌లాగా ప్రసరింపజేసి మలేరియాను సులభంగా నిర్ధారించొచ్చని వివరించారు. దీన్ని స్మార్ట్‌ఫోన్ ద్వారా ఆపరేట్ చేయొచ్చని, ఫలితం త్వరగా తెలిసిపోతుందన్నారు.