ఫ్రాంక్ఫర్ట్: లుఫ్తాన్సా విమాన సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. సాంకేతిక సమస్య వల్ల వందలాది విమానాలు రద్దయ్యాయి. కొన్ని విమానాలను దారి మళ్లించారు. జర్మన్ ఎయిర్‌లైన్ దిగ్గజం లుఫ్తాన్సా ఈ మేరకు బుధవారం ప్రకటించింది. ఫ్రాంక్‌ఫర్ట్‌లో నిర్మాణ పనుల వల్ల కేబుల్ తెగినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల తమ గ్రూప్ సంస్థలకు చెందిన పలు విమానాలు రద్దు అయినట్లు పేర్కొంది. మరికొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా దీని ప్రభావం పడినట్లు వివరించింది.
కాగా, ఫ్రాంక్ఫర్ట్ ప్రాంతంలో బ్రాడ్‌బ్యాండ్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ దెబ్బతినడంతో లుఫ్తాన్సా కంప్యూటర్ వ్యవస్థలో పెద్ద సమస్య తలెత్తినట్లు వార్తా సంస్థలు తెలిపాయి. దీంతో చాలా రద్దీ అయిన ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్‌పోర్ట్‌లో లుఫ్తాన్సా సర్వీసులన్నీ నిలిచిపోయినట్లు చెప్పాయి. ఈ నేపథ్యంలో ఆ ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో మిగతా విమానాల రాకపోకలను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతించలేదని పేర్కొన్నాయి. ఫ్రాంక్ఫర్ట్తోపాటు మ్యూనిచ్ విమానాశ్రయం కూడా ఎక్కువగా ప్రభావితమైనట్లు వెల్లడించాయి.
మరోవైపు యూరప్‌లోనే అతి పెద్ద ఎయిర్‌లైన్ గ్రూప్ లుఫ్తాన్సా. యూరోవింగ్స్, స్విస్, బ్రస్సెల్స్, ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ కూడా ఈ గ్రూప్‌కు చెందినవే. లుఫ్తాన్సా ప్రధాన కార్యాలయంలో తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల ఈ ఎయిర్లైన్పైనా వాటి ప్రభావం పడింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఇబ్బంది పడినట్లు తెలుస్తున్నది.
📢 Currently, the airlines of the Lufthansa Group are affected by an IT outage. This is causing flight delays and cancellations. We regret the inconvenience this is causing our passengers.
— Lufthansa News (@lufthansaNews) February 15, 2023