వాషింగ్టన్, మార్చి 9: న్యూయార్క్‌కు చెందిన లాంగ్ ఐలాండ్‌లోని అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. దీంతో గవర్నర్ క్యాథీ హోచుల్ రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ముఖ్యంగా లాంగ్ ఐలాండ్‌లో పలు చోట్ల చెలరేగిన కార్చిచ్చు శనివారం భీకర రూపం దాల్చింది. ఇక్కడి ఓ ప్రధాన జాతీయ రహదారిని అధికారులు మూసేయించారు. మిలటరీ బేస్‌ను ఖాళీ చేయించారు. అలాగేపైన్ బారెన్స్ ప్రాంతం చుట్టూ పలు చోట్ల మంటలు చెలరేగాయి. వేగంగా కదులుతున్న దావానలంతో ఇక్కడున్న ఓ రసాయన కర్మాగారం, అమెజాన్ వేర్‌హౌస్‌కు ప్రమాదం పొంచి ఉందని అధికారులు అంచనా వేశారు. రెండు వాణిజ్య సంస్థల భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. లాంగ్ ఐలాండ్ అటవీ ప్రాంతంలో మంటల్ని ఆర్పేందుకు మొత్తం రాష్ట్ర యంత్రాంగం రంగంలోకి దిగింది.