లాస్ వెగాస్: రుచిగా ఉండటం మాత్రమే కాకుండా సంగీతాన్ని వినిపించే లాలీపాప్ను సీఈఎస్, 2026లో ప్రదర్శించారు. దీనిని బోన్ కండక్షన్ టెక్నాలజీతో తయారు చేశారు. లాలీపాప్ స్టార్ పేరుతో విడుదలైన ఈ లాలీపాప్ను నాలుకతో నాకినా, పళ్లతో కొరికినా శబ్ద తరంగాలు పుర్రెలోని ఎముకల ద్వారా ప్రయాణించి, లోపలి చెవులకు చేరుతాయి.
ఈ సంగీత విందును అందిస్తున్న కంపెనీ లావా ఇచ్చిన ప్రకటనలో, సీఈఎస్, 2026 ముగిసిన తర్వాత లాలీపాప్ స్టార్ వెబ్సైట్ ద్వారా వీటిని కొనుక్కోవచ్చునని తెలిపింది. ఒక లాలీపాప్ ధర సుమారు రూ.808 అని పేర్కొంది. ప్రీ-లాంచ్ ఎడిషన్లో పరిమితంగానే విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఇదిలావుండగా, ఇటువంటి టెక్నాలజీని దాదాపు పాతికేళ్ల క్రితం టూత్బ్రష్లో కూడా వాడారని నెటిజన్లు గుర్తు చేశారు. “నేను తినే క్యాండీ వాణిజ్య ప్రకటనలను వినిపించాలని నేను కోరుకోను” అని ఓ నెటిజన్ పోస్ట్ చేశారు. దీనిని వేగంగా తింటే ఏమీ వినలేమని మరొకరు చెప్పారు.