న్యూయార్క్: ఇటీవల వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. భారీ ఆపరేషన్ చేపట్టి ఆయన్ను అధ్యక్ష కార్యాలయం నుంచి నిర్బంధించి తీసుకెళ్లింది. ప్రస్తుతం మదురో అమెరికా చెరలో ఉన్నారు. అయితే మదురోను ఎత్తుకెళ్లిన రీతిలోనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా పట్టుకువస్తారా అని అడిగిన ప్రశ్నకు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) స్పందించారు. ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆ ప్రయత్నం అవసరం లేదన్నారు. అలాంటి సూచనలను ఆయన తిరస్కరించారు. కానీ ఉక్రెయిన్‌తో జరుగుతున్న రష్యా యుద్ధం పట్ల తీవ్ర ఫ్రష్ట్రేషన్ వ్యక్తం చేశారు.
ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ సందర్భంలో మాట్లాడుతూ మదురో తర్వాత ఆ లైన్లో పుతిన్ ఉన్నట్లు పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను ఊటంకిస్తూ ట్రంప్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. రష్యా నేతను టార్గెట్ చేసే ఆలోచన లేదన్న విషయాన్ని ట్రంప్ తెలిపారు. పుతిన్‌తో తమకు మంచి రిలేషన్ ఉన్నట్లు వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధంలో ఎక్కువగా సైనికులు చనిపోతున్నారని, గత నెలలోనే 31వేల మంది రష్యా సైనికులు ప్రాణాలు కోల్పోయారని, రష్యా ఆర్థిక వ్యవస్థ కూడా దిగజారిందని, ఈ సమస్యను పరిష్కరిస్తామని, చాలా త్వరగా సైనికుల మరణాలను ఆపాలని ట్రంప్ అన్నారు. ఇప్పటి వరకు 8 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ చెప్పారు.