వాషింగ్టన్, మార్చి 22: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం.. తాజాగా తాత్కాలిక వలసదారులపై కొరడా ఝళిపించింది. అమెరికా వ్యాప్తంగా 5 లక్షల మందికిపైగా వలసదారులకు తాత్కాలిక నివాస హోదాను రద్దు చేస్తున్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (అమెరికా ఆంతరంగిక భద్రతా శాఖ) ప్రకటించింది. క్యూబా, హైతీ, నికరాగ్వ, వెనెజులా దేశాల నుంచి వలస వచ్చిన లక్షల మందికి చట్టపరమైన రక్షణను రద్దు చేస్తున్నట్టు వెల్లడించింది. 2022 అక్టోబర్ తర్వాత ఆ 4 దేశాల నుంచి అమెరికాకు వలసవచ్చిన దాదాపు 5.32 లక్షల మందికి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని, దీంతో వారిని నెల రోజుల్లో అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. వీరంతా అమెరికాలో నివసించేందుకు పొందిన లీగల్ స్టేటస్‌ను ఏప్రిల్ 24న లేదా ఫెడరల్ రిజిస్టర్లో నోటీసులు ప్రచురించిన 30 రోజుల తర్వాత కోల్పోతారని తెలిపారు. తాత్కాలికంగా అమెరికాకు వచ్చి రెండేండ్లపాటు నివసించేందుకు వీలుగా అధ్యక్షుడు మానవతా దృక్పథంతో ఈ లీగల్ స్టేటస్‌ను కల్పిస్తారు.
ఒక్క రోజులో 1,000 ‘గోల్డ్ కార్డు’ల విక్రయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన ‘గోల్డ్ కార్డు’కు విపరీతంగా డిమాండ్ ఉన్నట్టు తెలుస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 1,000 గోల్డ్ కార్డులను విక్రయించినట్టు అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లుట్నిక్ శనివారం ప్రకటించారు. తద్వారా 5 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.43,000 కోట్లు) సమీకరించినట్టు వెల్లడించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. గోల్డ్ కార్డును కొనేందుకు లక్షల మంది సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. 10 లక్షల మంది కొనుగోలు చేసినా 5 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.4,30,00,175 కోట్లు) సేకరించవచ్చని ట్రంప్ భావిస్తున్నారని తెలిపారు.