ఇస్లామాబాద్: జమ్ముకశ్మీర్‌పై పాకిస్థాన్ మరోమారు తన వక్రబుద్దిని బయటపెట్టుకున్నది. జమ్ము కశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి తాలిబన్ల సాయం తీసుకుంటామని పాకిస్థాన్ అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రిక్ ఇ ఇన్సాఫ్ (పీటీఐ) అధికార ప్రతినిధి నీలం ఇర్షాద్ షేక్ మంగళవారం చెప్పారు.
టీవీ చానెల్లో జరిగిన చర్చలో ఈ అంశం ప్రకటించారు. కశ్మీర్ అంశంపై పాకిస్థాన్‌తో చేతులు కలుపుతామని తాలిబన్లు ప్రకటించారని నీలం ఇర్షాద్ షేక్ తెలిపారు. దీంతో పాకిస్థాన్ సైన్యానికి, తాలిబన్లకు ఉన్న సన్నిహిత సంబంధాలు బహిర్గతం అయ్యాయి.
ఇంతకుముందు తాలిబన్లు స్పందిస్తూ.. కశ్మీర్ సమస్య భారత్ అంతర్గత, ద్వైపాక్షిక సమస్య అని అభివర్ణించారు. తాజాగా మారిన పరిస్థితుల్లో తాలిబన్లు ఎటువంటి వైఖరి తీసుకుంటారో తేలాల్సి ఉంది.
పీటీఐ అధికార ప్రతినిధి ఈ వ్యాఖ్య చెప్పగానే అప్రమత్తమైన చానెల్ న్యూస్ యాంకర్.. ఈ షో ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం అవుతున్నది. భారతీయులు వీక్షిస్తున్నారు. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? .. మీరేం చెప్పారో మీకు అర్థం అవుతుంతా? అని నీలం ఇర్షాద్ షేక్‌ను ఉద్దేశించి అన్నారు.