కాఠ్మండు: కడుపులో నొప్పితో బాధపడిన ఒక వ్యక్తి ఆసుపత్రికి వెళ్లాడు. పరిశీలించిన వైద్యులు ఎక్స్‌రే తీశారు. కడుపులో కత్తి బ్లేడ్ ఉండటం చూసి షాకయ్యారు. (Knife in Man’s Abdomen) సర్జరీ ద్వారా దానిని బయటకు తీశారు. నేపాల్‌లో ఈ సంఘటన జరిగింది. మద్యం మత్తులో ఉన్న 22 ఏళ్ల యువకుడు, ఒక వ్యక్తి మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి కత్తితో పొడిచాడు. గాయపడిన యువకుడ్ని ఆసుపత్రికి తరలించారు. గాయం వద్ద కుట్టు వేసి ఇంటికి పంపారు.
కాగా, మరునాడు ఆ యువకుడు కడుపు నొప్పితో బాధపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడ్ని మరో ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. కడుపు వద్ద కుడి వైపు కుట్టు ఉండటం చూసి ఏం జరిగిందని ప్రశ్నించారు. ఒక వ్యక్తి కత్తితో పొడిచిన సంఘటన గురించి అతడు చెప్పాడు. ఈ నేపథ్యంలో పలు వైద్య పరీక్షలు చేయడంతోపాటు ఎక్స్‌రే కూడా తీశారు.
మరోవైపు ఎక్స్‌రేను డాక్టర్లు పరిశీలించారు. యువకుడి కడుపు లోపల 15 సెంటీమీటర్ల పొడవైన కత్తి బ్లేడ్ ఉండటం చూసి షాక్ అయ్యారు. కడుపులో అది అటూ ఇటూ కదిలినట్లు డాక్టర్లు తెలిపారు. అయితే దీని వల్ల ఇతర అంతర్గత అవయవాలకు ఎలాంటి గాయం కాలేదని చెప్పారు. ఆ యువకుడి కడుపులో ఉన్న కత్తి బ్లేడ్‌ను లాపరోటమీ సర్జరీ ద్వారా బయటకు తీసినట్టు డాక్టర్లు వెల్లడించారు.